క్రెడిట్ కార్డు బ్లాక్ చేయమని కస్టమర్ కేర్‌కి ఫోన్ చేస్తే క్రెడిట్ కార్డు నుంచి రూ.1.59 లక్షలు మాయం చేశారని బాధితురాలు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు అంకమ్మ నగర్‌కు చెందిన శిరీష ఎన్నారై మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆమె గత రెండు సంవత్సరాలుగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారు. తన క్రెడిట్ కార్డు బ్లాక్ చేయాలని కార్డుపై ఉన్న టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేశారు. అవతల ఫోన్ తీసిన వ్యక్తి తమ కస్టమర్ కేర్ వాళ్లు త్వరలో మాట్లాడతారని సమాధానమిచ్చారు. శుక్రవారం ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఎస్.బి.ఐ క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ సిబ్బందినని చెప్పాడు. మీకు వచ్చే ఓటీపీ చెబితే కార్డు బ్లాక్ అవుతుందని ఆ వ్యక్తి చెప్పాగా.. ఆమె ఓటీపీ చెప్పింది. వెంటనే రెండు విడతల్లో రూ. 80,027, 79, 014 మొత్తంగా ఆమె ఖాతా నుంచి 1,59,041 నగదు తీసినట్లు సంక్షిప్త సందేశం వచ్చింది. ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే స్విచ్చాప్ వచ్చింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నగరంపాలెం సీఐ హైమారావు తెలిపారు.
ఉద్యోగం పేరిట మోసం..
ఫిజియోథెరపిస్టు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5 లక్షలు తీసుకొని మోసగించారంటూ భాదితురాలు నగరంపాలెం పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు మల్లారెడ్డి నగర్‌కు చెందిన చైతన్య ఫిజియోథెరపిస్టు కోర్సు అభ్యసించారు. 2020లో ప్రభుత్వం ఫిజియోథెరపిస్టు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరిస్టుగా పనిచేస్తున్న ఓ మహిళ, ఆమె భర్తతో పాటు మరొకరు చైతన్యను కలిసి ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. కలెక్టర్, ఎంపీ తెలుసని నమ్మించారు. ఓ ఎంపీకి చెందిన లెటర్ హెడ్ చూపించారు. 2020 ఆక్టోబర్ 20న కలెక్టర్ కార్యాలయానికి తీసుకువెళ్లి ఆమెను కిందనే ఉంచారు. ఆ వ్యక్తులు భవనం పైకి వెళ్లి ఆ పోస్టు విషయమై కలెక్టర్‌తో మాట్లాడామని రూ.5 లక్షలు ఇస్తే ఉద్యోగం వస్తుందని మాయ మాటలు చెప్పారు. వారిని నమ్మిన ఆమె రూ.5 లక్షలు ఇచ్చింది. అప్పటి నుంచి ఎలాగోలా కాలం వెళ్లదీస్తున్నారు. ఉద్యోగం అవసరం లేదు నగదు ఇవ్వలని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు వాపోయింది. అంతే కాకుండా తనపైనే పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Suicide: అప్పుల బాధ తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య