ప్రమాదం ఏదైనా సరే వెంటనే గుర్తొచ్చేది విపత్తు నిర్వహణ బృందాలే. దేశంలో ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా అక్కడ వాలిపోతారు. బాధితుల్ని రక్షిస్తారు. ప్రజలకు అండగా నిలబడతారు. వివిధ సందర్భాలకు తగ్గట్లుగా పనిచేయటంపై వారు తరచూ సాధన చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా... రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలనే అంశంపై గుంటూరులో ఓ మాక్ డ్రిల్ నిర్వహించారు. రైల్వే వర్క్ షాప్ ప్రాంగణంలో జరిగిన ఈ డ్రిల్‌లో.... ఎక్కడైనా రైలు పట్టాలు తప్పినప్పుడు ఎలా స్పందించాలన్నది.. చేసి చూపించారు.
రైల్వే శాఖలోని పరిపాలన, ఇంజినీరింగ్, సాంకేతిక, వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుని అక్కడ సహాయ చర్యలు చేపట్టారు. బోగీలో ఉన్నవారిని రక్షించటం మొదటి ప్రాధాన్యతగా గుర్తించారు. అందుకుగాను పై భాగంలో కట్ చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలకు ప్రవేశించారు. ఆ తర్వాత రైలులోని ప్రయాణికులను బయటకు తీసుకురావటం, వారికి ప్రథమ చికిత్స అందించటం, ఆసుపత్రికి తరలించటం, ఆ తర్వాత ట్రాక్‌ను క్లియర్ చేయటం వరకూ చేపట్టాల్సిన అంశాలపై డ్రిల్ నిర్వహించారు.