ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్‌కు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ 11 పేజీల లేఖ

MLC Vamsikrishna Yadav: వైఎస్సార్సీపీని వీడి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ పార్టీలో తాను ఎదుర్కొన్న అవమానాలను వివరిస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. కష్టపడి పనిచేసినా గుర్తించలేదని వాపోయారు. పార్టీ కోసం ఎంతో ఖర్చుపెడితే తన క్వారీ వ్యాపారాన్ని దెబ్బకొట్టారని ఆవేదన వెళ్లగక్కారు. ఎమ్మెల్యే టికెట్‌, మేయర్‌ పదవి ఆశచూపి మాయ చేశారని లేఖలో వాపోయారు.

MLC_Vamsikrishna_Yadav
MLC_Vamsikrishna_Yadav

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 7:17 AM IST

MLC Vamsikrishna Yadav: వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ సీఎం జగన్‌కు 11 పేజీల లేఖ రాశారు. అందులోని అంశాలు పార్టీవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. "ఏడాదిన్నరగా కలవాలని ప్రయత్నిస్తున్నా అవకాశం ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. మంత్రి పదవి ఇస్తారనుకుంటే తన రాజకీయ జీవితానికే ఎర్రబల్బు వేశారని వాపోయారు. వైఎస్సార్సీపీలో చేరాలని ఆహ్వానం వచ్చినప్పుడు తండ్రి చనిపోయిన బాధలో ఉన్నా చేరానని గుర్తుచేశారు.

అంతన్నాడు, ఇంతన్నాడు - తీరా చూస్తే నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచుతున్నాడు

విశాఖలో పార్టీ బలోపేతానికి ఆది నుంచి కష్టపడి పనిచేస్తే కనీసం మనిషిలానైనా గుర్తించలేదన్నారు. ధర్నాలు, బంద్‌లు, అర్ధరాత్రి రోడ్లపై పడుకుని నిద్రలేని రాత్రులు గడిపానని లేఖలో పేర్కొన్నారు. ఇంత చిన్నచూపు చూస్తారని ఇన్ని ఇబ్బందులు పెడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌జైల్లో ఉండి పార్టీ కష్టంలో ఉన్నప్పుడు అండగా ఉంటే అధికారంలోకి వచ్చాక నమ్మకద్రోహం చేసి ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి ఘోరంగా అవమానించారని పేర్కొన్నారు.

విశాఖ వచ్చినప్పుడల్లా తమ ఇంటికి వస్తే అన్నగా భావించానని అలాంటి తనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని వంశీకృష్ణ లేఖలో ఆవేదన వెలిబుచ్చారు. "2014లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని వంశీకృష్ణ లేఖలో పేర్కొన్నారు. ఎంపీగా విశాఖలో విజయమ్మను నిలబెట్టినప్పుడు పార్టీ కార్యాలయానికి కడప నుంచి చాలా మంది వచ్చి వాల్తేరు క్లబ్‌లో గొడవలు చేస్తున్నారని విశాఖను దోచుకోవడానికి కడప రౌడీమూకలు వచ్చాయన్న ప్రతిపక్షాల ప్రచారంతోనే ఓటమి పాలయ్యానని లేఖలో పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీలో చిచ్చురేపుతున్న నియోజకవర్గాల బాధ్యుల మార్పు

2019లో ఎలాగైనా గెలవాలని రెండేళ్ల ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమైనా తూర్పు సమన్వయకర్తగా ఉన్న తనను నోటిఫికేషన్‌ ముందురోజు తొలగించారని వాపోయారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 21వ వార్డులో పోటీచేయించారని ఫలితాలు రాగానే, మేయర్‌ పదవి మహిళకు ఇస్తామని విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలతో చెప్పించారన్నారు. మహిళను మేయర్‌ చేయాలనుకున్నప్పుడు, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నన్ను ఎందుకు కార్పొరేటర్‌గా పోటీ చేయించారని ప్రశ్నించగా అది సీఎం నిర్ణయమన్నారని వాపోయారు.

వైఎస్సార్సీపీ మునిగి పోతున్నా జగన్ మేకపోతు గాంభీర్యం!

కనీసం తనను కలిసే అవకాశం ఇవ్వలేదని ప్రొటోకాల్‌ కోసం విప్‌ పదవి ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. సొంత క్యాడర్‌ లేని ఎంవీవీ సత్యనారాయణ, ఏయూ మాజీ వీసీ ప్రసాద్‌రెడ్డిల తప్పుడు మాటలు విని తనను పక్కన పెట్టారని వంశీకృష్ణ వాపోయారు. ప్రత్యక్ష రాజకీయాలకు, ప్రజలకు దూరం చేసేలా ఎమ్మెల్సీ ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. తన ఇంటికి కూతవేటు దూరంలో జరిగిన పార్టీ కార్యక్రమానికి మంత్రి విడదల రజిని వచ్చినా ఆహ్వానించలేదన్నారు.

పార్టీ కోసం కష్టపడిన యువతకు ఉద్యోగాలివ్వాలని లేఖ ఇస్తే 'నేనేం చేయగలను అవుట్‌ సోర్సింగ్‌ ట్రై చేసుకో' అని చెప్పారని ఆవేదన వెళ్లగక్కారు. తూర్పు సమన్వయకర్తగా ఎంవీవీ సత్యనారాయణకు బాధ్యతలు ఇస్తున్నప్పుడు 12 ఏళ్లు పనిచేసిన తనకు ఒక్క మాట చెప్పలేదన్నారు. 30 ఏళ్లుగా భాగస్వామ్యంతో నడుస్తున్న తన క్వారీకి అన్యాయంగా పెనాల్టీ వేశారని ఈ విషయాన్ని అయిదుసార్లు జగన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని లేఖలో వంశీకృష్ణ వాపోయారు.

తాడేపల్లి కేంద్రంగా వైసీపీలో తుపాను - 'టికెట్ రాకున్నా హ్యాపీ - ఓడిపోవడం కంటే అదే బెటర్'

అధికారంలో ఉన్నా సొంత వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా వేసిన పెనాల్టీలు తీయించాలని మైన్స్‌ బిల్లులు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. చివరికి వ్యాపారం నుంచి తప్పుకున్నానని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన భార్య అనారోగ్యానికి గురయ్యారని లేఖలో వంశీకృష్ణ వాపోయారు. ఆత్మాభిమానం చంపుకోలేకే పార్టీ వీడానని వంశీకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details