రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై సవరణ కోరామని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. తనతో పాటు మరో ఎమ్మెల్సీ అశోక్ బాబు సైతం సవరణ కోరారరన్నారు. 70 శాతం మంది విద్యార్థులు ఆంగ్లమాధ్యమం, 30 శాతం మంది విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకున్నారని సీఎం జగన్ చెప్పారని... ఇప్పుడు ఆ 30 శాతం మందిని ఏం చేద్దామనుకుంటున్నారని రామకృష్ణ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల సాధినేని చౌదరయ్య కళాశాలలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆంగ్ల మాధ్యమ బిల్లును వ్యతిరేకించామన్నారు. రాష్ట్రంలో 1.86 లక్షల మంది ఉపాధ్యాయుల్లో మెజార్టీ దీనిని మంచి పద్ధతి కాదంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు మీడియం ఎంచుకునే అవకాశం లేకపోవడం వారి హక్కులను కాలరాయడమేనని అన్నారు. పిల్లలకి ఇంగ్లిష్తో పాటు మాతృ భాష కూడా అవసరమని ఇదే సరైన విధానమని రామకృష్ణ స్పష్టం చేశారు.
'ఆ అవకాశం లేదంటే విద్యార్థుల హక్కులు కాలరాయడమే' - ఎమ్మెల్సీ రామకృష్ణ వార్తలు
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడాన్ని మెజార్టీ ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయం తెలుసుకోకుండా ప్రభుత్వం ఈ విషయంలో మొండి వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. విద్యార్థులకు మీడియం ఎంచుకునే అవకాశం లేకపోవడం వారి హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు.
'ఆంగ్లమాధ్యమంపై ప్రభుత్వ వైఖరి విద్యార్థుల హక్కులను కాలరాయడమే..!'