MLAs Poaching Case Latest Update: ప్రజాస్వామ్యం.. విలువల గురించి మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడిందని, అలాంటప్పుడు మరోపార్టీ వైపు వేలెత్తి చూపే హక్కు ఎక్కడుందని కరీంనగర్‌కు చెందిన బి.శ్రీనివాస్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, ముగ్గురు నిందితులతోపాటు, తుషార్, న్యాయవాది బి.శ్రీనివాస్ తదితరులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లపై బుధవారం జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాది ఉదయ్ హొళ్ల వాదనలు కొనసాగించారు.
‘‘ఇదే టీఆర్ఎస్ 2014లో 23 మంది ఎమ్మెల్యేలను, 2018లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఫిర్యాదు చేసిన నలుగురిలో ముగ్గురు కాంగ్రెస్ నుంచి పార్టీ ఫిరాయించినవారే. ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు చెప్పేవారు ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడ్డారు. ఇప్పుడు బీజేపీ వైపు వేలెత్తి చూపుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును విచారిస్తున్న సిట్‌కు విశ్వసనీయత లేదు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నవారే దానికి అధిపతి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధిపతి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఒకరే. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని స్వయంగా గవర్నరే చెప్పారు. పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతాయి. దీనికి ఆయనే సమాధానం చెప్పాలి. షర్మిలను కారుతో సహా క్రేన్ ద్వారా తరలించిన చర్యకూ ఈయనే సమాధానం చెప్పాలి. 30 మంది పోలీసులు నా క్లయింట్ ఇంటిపై దాడి చేసి 41ఎ కింద నోటీసు అంటించారు. అంటించిన నోటీసులను పత్రికలకు జారీ చేసి గౌరవంగా జీవించే, చట్టబద్ధ జీవనానికి ఈ కమిషనర్ నేతృత్వం వహిస్తున్న సిట్ విఘాతం కలిగించింది’’ అని వివరించారు.