ప్రపంచస్థాయి పర్యటక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే విడుదల రజిని స్పష్టం చేశారు. అటవీ అధికారులతో కలిసి కొండవీడు కోటలో మెుక్కలు నాటిన ఆమె...ఇప్పటికే పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. డిసెంబరు రెండో వారంలో అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ప్రవేశ ద్వారం, పుట్టాలమ్మ చెరువు, వాచ్ టవర్, సైన్ బోర్డుల ఏర్పాటు లాంటి పనులను చేపడుతున్నట్లు తెలిపారు.
థీమ్‌పార్కు ఏర్పాటు, పెయింట్లు, వాటర్ ట్యాంక్, సోలార్‌లైట్లు ఏర్పాటు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే కొండపై బురుజుల నిర్మాణం పూర్తికావొస్తోందని ఎమ్మెల్యే వివరించారు. పిల్లల పార్కు, పార్కింగ్ ఏరియా అభివృద్ధి పనులు నాలుగు రోజుల కిందటే ప్రారంభించినట్లు వెల్లడించారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం పూర్తయిందని.. విగ్రహ ప్రతిష్ఠ త్వరలోనే జరుగుతుందన్నారు.