నాడు-నేడులో భాగంగా విద్య, వైద్య రంగాలకు వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని రెడ్డిపాలెంలో రూ. కోటి 20 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
పీహెచ్సీ నూతన భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన - రొంపిచర్లలో నూతన పీహెచ్సీ భవనాలకు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన
రొంపిచర్ల మండలంలో పీహెచ్సీ నూతన భవనాలు, వైద్య పరికరాల కోసం రూ.2 కోట్ల 20 లక్షలు మంజురు చేశామని నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెడ్డిపాలెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. నాడు-నేడులో భాగంగా విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశామని వివరించారు.
రొంపిచర్ల, రెడ్డిపాలెంలలో పీహెచ్సీలు శిథిలావస్థకు చేరుకున్నందుకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే తెలిపారు. వైద్యం కోసం జనం ఇక్కడికి రావడమూ మానేసిన పరిస్థితిని చూశామన్నారు. నూతన భవనాలు ఏర్పాటు చేసి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. రొంపిచర్లకి రూ. 60 లక్షలు, రెడ్డిపాలెంకు రూ. కోటి 20 లక్షలు కేటాయించామన్నారు. రెడ్డిపాలెం నూతన పీహెచ్సీలో వైద్య పరికరాల కోసం మరో రూ. 40 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. ఏదైనా అత్యవసరమైతే నరసరావుపేటలోని 200 పడకల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి:గుంటూరు వైద్యుల ఘనత: అవతార్ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స