అభివృద్ధి వికేంద్రీకరణ వైకాపా మేనిఫెస్టోలో ఉందని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగానే అమరావతి కూడా రాజధానే అని శ్రీదేవి తెలిపారు. అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని చంద్రబాబు భావిస్తే... ఆయనతో సహా తెదేపా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి గెలవాలని సూచించారు. రాష్ట్రంలో ఏదైనా ఘటన జరిగితే.. తెదేపా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేస్తున్నామని ఆమె అన్నారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడైనా ఇలాంటి చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు.
అమరావతిపై వీధి నాటకాలు ఆడుతున్న చంద్రబాబు అండ్ కోను సూటిగా అడుగుతున్నాననీ.. 2014లో చంద్రబాబు గెలిస్తే... అమరావతిలో రాజధాని నిర్మిస్తానని చెప్పారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక.. అన్ని పార్టీలతో సమావేశం పెట్టి, అందరికీ అనువైన చోట రాజధాని నిర్మించటానికి ప్రయత్నించారా అని నిలదీశారు.