గుంటూరు జిల్లా అభివృద్ది మండలి సమీక్ష సమావేశం వేదికగా... మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొందరు అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా మద్దతుదారులైన వారికి మంచి పోస్టింగులు ఇవ్వడం వెనుక ఔచిత్యం ఏమిటంటూ ప్రశ్నించారు. కోట్లాది రూపాయల టర్నోవర్ ఉండే గుంటూరు మిర్చియార్డు పర్సన్ ఇన్ఛార్జిగా... అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న అధికారిని నియమించడాన్ని ఎమ్మెల్యే ఆర్కే తప్పుబట్టారు.
మంత్రి ఎదుట అధికార పార్టీ ఎమ్మెల్యే అసంతృప్తి... ఎందుకంటే... - అధికారులపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ ఆగ్రహం న్యూస్
కొందరు అధికారులకు ఉన్నత పదవులు దక్కడంపై ఎమ్మెల్యే ఆర్కే అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్‌ను గెలిపించడానికి వారు ప్రయత్నించారని ఆరోపించారు. వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని... అలాంటి వారికి ఆ పదవులు ఏంటని ప్రశ్నించారు ఆర్కే.
![మంత్రి ఎదుట అధికార పార్టీ ఎమ్మెల్యే అసంతృప్తి... ఎందుకంటే...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5157042-229-5157042-1574518415544.jpg)
మంగళగిరి నియోజకవర్గంలో తనను ఓడించేందుకు అప్పటి కలెక్టర్, ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఉన్న కోన శశిధర్, గుంటూరు డీఆర్వోగా పనిచేస్తున్న పులి శ్రీనివాసులు ప్రయత్నించారని... ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళగిరి స్థానంలో లోకేశ్‌ను గెలిపించాలంటూ... వారు పోలింగ్ ఆఫీసర్(పీవో)తో మాట్లాడిన సంభాషణ బయటపెడతానని చెప్పారు. అలాంటి అధికారిని డీఆర్వోగా నియమించారని గుర్తుచేసిన ఆర్కే... వారికి ఎలా మంచి పోస్టింగులు దక్కాయంటూ ప్రశ్నించారు.
ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని... అవసరమైతే న్యాయపరంగా కోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. దీనిపై మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. వేరే ప్రత్యామ్నాయం లేకే ఆ అధికారిని నియమించామని... తక్షణమే అతన్ని ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పిస్తామని హామీఇచ్చారు. ఇందులో వేరే దురుద్దేశమేమీ లేదని స్పష్టం చేశారు. అధికారుల పోస్టింగుల గురించి ఇలాంటి వేదికలపై మాట్లాడటం సముచితం కాదని... ఆర్కేకు మంత్రి మోపిదేవి సూచించారు.