నాగార్జున విశ్వవిద్యాలయం పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. తాను అక్కడి ఎమ్మెల్యే అయినప్పటికీ.. యూనివర్శిటీలో జరిగే కార్యక్రమాల ఆహ్వాన పత్రికలో తన పేరు ముద్రించడం లేదని రోశయ్య శాసనసభ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు పంపించారు. ఈనెల 20 లోపు సభాపతి ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా.. ఈనెల 18వ తేదీన విశ్వవిద్యాలయంలో జరగనున్న కార్యక్రమం ఆహ్వాన పత్రంలోనూ ఎమ్మెల్యే రోశయ్య పేరు లేకుండా ముద్రించారు. దీంతో ఆయన ఈ విషయాన్ని మంత్రి ఆదిమూలపు సురేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకిలా చేస్తున్నారని మంత్రి యూనివర్శిటీ అధికారులను ఫోన్లో ప్రశ్నించారు. విశ్వవిద్యాలయం ప్రొటోకాల్ బుక్ మేరకే ఆహ్వానపత్రాలు, శిలాఫలకాల్లో పేర్లు ఉంటాయని అధికారులు మంత్రికి వివరించారు. స్థానిక ఎమ్మెల్యేగా ఆయనను గౌరవించాలన్న మంత్రి సూచనతో అధికారులు జరిగిన పొరపాటుని సరిదిద్దుకున్నారు. ఆహ్వానపత్రం, శిలాఫలకంలో ఎమ్మెల్యే రోశయ్య పేరుని చేర్చినట్లు ఆయనకు యూనివర్శిటీ రిజిస్ట్రార్ తెలిపారు.