గుంటూరు జిల్లా వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విలేకరులపై విరుచుకుపడ్డారు. ఆదివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వినుకొండలో అసైన్డ్ భూములను ఆక్రమించి ప్లాట్లు వేస్తున్నారని, వాటిపై వార్తలు ఎందుకు రాయడం లేదని, పట్టణంలో సమస్యలపై ప్రముఖంగా వార్తలు ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తాగునీరు, మురుగునీటి సమస్యపై వార్త రాసిన ఓ పత్రిక విలేకరిని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు.
‘పట్టణంలో పదేళ్లలో సమస్యలు లేవా. ఇప్పుడే ఉన్నట్లు రాస్తావా. నువ్వు చాలా చేశావు. నీ సంగతి తేలుస్తా’ అంటూ హెచ్చరించారు. ‘వార్తలు రాసి నన్ను బెదిరిస్తావా.. నువ్వెంత’ అంటూ సీటులో నుంచి లేచి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మధ్యలో ఓ ఛానల్ విలేకరి కల్పించుకుని భూముల ఆక్రమణపై వార్తలు రాస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఎవరేం చేస్తున్నారో.. అంతా తెలుసు.. నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు.. బయటకు పో..’ అంటూ కోపంగా ఊగిపోయారు. దీంతో ఆ విలేకరి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం తాగునీటి సమస్యపై వార్తలు రాసిన విలేకరిపై మరోసారి విరుచుకుపడ్డారు. అసభ్యపదజాలంతో దూషించారు. ఇంతలో ఎమ్మెల్యేకు ఫోన్ రావడంతో రావడంతో విలేకరుల సమావేశం ముగించి వెళ్లిపోయారు.