గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈనెల 22 నుంచి సంపూర్ణ లాక్డౌన్ విధించాలని అధికారులు నిర్ణయించారు. పట్టణంలో 165 కరోనా కేసులు, చుట్టుపక్కల గ్రామాల్లో 30కి పైగా కేసులు నమోదు కావడంపై.. అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ముందుగానే తమకు కావాల్సిన నిత్యావసర సరుకుల్ని కొనుగోలు చేసి ఉంచుకోవాలని సూచించారు. ఆదివారం కరోనా రోగి నడిరోడ్డుపై మరణించి ఘటన.. ప్రజల్లో మరింత ఆందోళన పెంచింది. ఇప్పటి వరకూ సత్తెనపల్లిలో 8 మంది కరోనా కారణంగా మరణించిన పరిస్థితుల్లో.. అధికారులు వైరస్ నివారణపై ముమ్మరంగా చర్యలు మొదలుపెట్టారు.
ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇవాళ సత్తెనపల్లిలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. కేసుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తపేట, నాగార్జు నగర్, రఘురాం కాలనీ, వడ్డవల్లి ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు కావడంపై... ఇప్పటికే ఆయా ఏరియాలను రెడ్జోన్లుగా ప్రకటించారు. అయితే మిగతా ప్రాంతాల్లోనూ ప్రజల రాకపోకల్ని కట్టిడి చేయటం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా అధికారులతో.. ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ సూచనలు వివరించారు.