మానవతా దృక్పథం లేని వైద్యులు జాతికి భారమని, అలాంటి వారిని సమాజం నుంచి వెలి వేయాలని గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లి వైకాపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా బాధితులకు పడకల కోసం తాపత్రయం అంతటా ఉందని చెప్పారు.
ఇదే అదనుగా కొందరు వైద్యులు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వైద్యసేవలకు వసూలు చేస్తున్నా రోగి బతుకుతాడో లేదో తెలియని పరిస్థితి ఉందని వాపోయారు. వైద్యం పేరిట ప్రజలను పిండేస్తున్న పరిస్థితి అంతటా ఉందన్నారు. ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు లిఖితపూర్వక ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.