నకిలీ విత్తనాల సంస్థలు ఏకంగా ప్రజా ప్రతినిధినే బురిడీ కొట్టించాయి. గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో 14 ఎకరాలు పొలం ఉంది. ఈ ఏడాది జూన్లో ఎమ్మెల్యేనే ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వద్ద 125 కిలోల బీపీటీ 5204 రకాన్ని కొనుగోలు చేశారు. 14 ఎకరాలలో వరి పంట వేయగా అక్టోబర్లో దాదాపు 20శాతం పంట ముందుగానే వచ్చింది. మిగిలిన 80శాతం పంట పూత దశలో ఉంది. స్వయంగా ఎమ్మెల్యే ఆర్కేనే పంటను చూసి దిగులు చెందారు. పూత వచ్చిన పంట చేతికి వచ్చేది లేదని గ్రహించి అధికారులను సంప్రదించారు. దీనిపై మూడు రోజుల క్రితం జిల్లా వ్యవసాయ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు అధికారులు పంటను పరిశీలించారు. మరో మూడు రోజుల్లో నివేదిక వస్తోందని రాగానే ఏపీ సీడ్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. తనకే ఇలా జరిగితే కౌలు రైతు పరిస్థితి ఏంటని అధికారులను ఎమ్మెల్యే నిలదీసినట్లు తెలిసింది. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఒక వైపు విత్తన చట్టం కఠినంగా అమలవుతున్నా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.