ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చనిపోయిన వాళ్లకు ఓటు - బతికున్న వారికి వేటు

Mistakes in West Guntur Voters List: బతికున్న వారి ఓట్లు లేపేశారు. చనిపోయిన వారి ఓట్లు కొనసాగించారు. జనమే ఉండని భవనాల డోర్‌ నంబర్‌పై ఓట్లు చేర్చారు. కుటుంబంలోని ఓట్లు విడదీశారు. ఇవీ గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గ ఓటరు జాబితాలో చిత్రవిచిత్రాలు.! గత జాబితాలో వచ్చిన తప్పులు సరిచేయాలంటూ ఇచ్చిన దరఖాస్తులు బుట్టదాఖలవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

Mistakes_in_West_Guntur_Voters_List
Mistakes_in_West_Guntur_Voters_List

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 10:37 AM IST

Updated : Nov 4, 2023, 1:04 PM IST

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చనిపోయిన వాళ్లకు ఓటు - బతికున్న వారికి వేటు

Mistakes in West Guntur Voters List :గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే అక్రమాలు చాంతాడంత కనిపిస్తాయి. ఈ ఏడాది జనవరిలో ఓటర్ల జాబితా విడుదల తర్వాత అందులో చాలా తప్పులు ఉన్నట్లు తేలింది. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తప్పులు సరిదిద్దాలని ఆదేశాలు వచ్చినా యంత్రాంగం నిర్లిప్తంగా వ్యవహరించింది. దీని ఫలితంగా గత జాబితాలో తప్పులు ఈసారీ కొనసాగాయి.

Votes for the Dead :లక్ష్మిపురం ఓటర్ల జాబితా పరిశీలిస్తే బూత్‌ నంబరు 125లో మొత్తం 817 మంది పేర్లు జాబితాలో ఉండగా వారిలో 16మంది చనిపోయారు. మృతి చెందిన వారికి సైతం అధికారులు ఓటు హక్కు(Right For Vote) కల్పించటం విశేషం. తాండ్ర జయచంద్ర, అనసూయమ్మ, వెంకట రామలింగేశ్వరరావు, వెంకటసుబ్బారావు, కోవెలమూడి విజయలక్ష్మి, సువర్ణ లక్ష్మి మరణించారు. పువ్వుల మధు, పువ్వుల కిరణ్మయి దంపతులు 2021లో మృతి చెందారనే విషయాన్ని బూత్‌ లెవల్‌ అధికారులకు తెలియజేసినా వారి పేర్లు కొత్త జాబితాలో కొనసాగించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

Fake Votes in Machilipatnam: తప్పుల తడకగా బందరు ఓటర్ల జాబితా.. ఎన్నికల సంఘం ఆదేశించినా పట్టించుకోని అధికారులు

Voters List Irregularities in AP :పువ్వుల శ్రీవత్సవ కుటుంబంలో మొత్తం 8 మంది ఉండగా వారి ఓట్లు వేర్వేరు బూత్‌లలోకి మార్చివేశారు. తాము నివసిస్తున్న 125వ బూత్‌లోనే అందరి ఓట్లు నమోదుచేయాలని దరఖాస్తు ఇచ్చినా మార్పు చేయలేదని వాపోయారు. ఇదే పోలింగ్ బూత్‌ పరిధిలోని ఇంటినంబరు 28-5-115లో నివసించే పెనుమత్స కృష్ణవేణి కుటుంబం ఐదు దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటోంది. గత ఎన్నికల వరకు ఓటు వేశారు. తాజా జాబితాలో ఆకుటుంబంలోని నలుగురికి ఓటు హక్కు తొలగించారు. 28-5-114లో నివసించే పెనుమత్స రమాదేవి ఓటు కూడా తొలగించారు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఓటు వేశామని, ఇప్పుడు ఎందుకు తొలగించారో తెలియడం లేదన్నారు.

Errors in Voter List :పండరీపురం మూడోలైనులో ఇంటినంబరు 28-1-38తో పాడుబడిన భవనం ఉంది. ఇందులో వరుస సంఖ్య 220 నుంచి 226 వరకు ఏడు ఓట్లు ఉన్నాయి. పత్తూరి ప్రమీల, గుండి నాగలక్ష్మి, చావలి తిరుపతమ్మ, సంటి నాగమోహన్, కోనేటి మహాలక్ష్మి, కోనేటి సుబ్బారావు, గుండి ప్రభాకర్‌ పేర్లతో ఓట్లు ఉన్నాయి. కానీ ఈ పేర్లతో ఇక్కడ ఎవరూ నివాసం ఉండటం లేదు. అలాగే పండరీపురం ఒకటోలైనులో ఉన్న బహుళ అంతస్థుల భవనంలో ఇంటి నంబరు 28-1-2తో దశాబ్దకాలంగా మహిళా వసతి గృహం నడుస్తోంది. ఇందులో 19 ఓట్లు ఉన్నాయి. ఇంటి యజమానికి ఒకరు ఉండగా మిగిలిన 18 ఓటర్లు ఎక్కడివారో తెలియదు.

Double Votes in Macharla: మాచర్లలో అధికార పార్టీ నేతల డబుల్ ధమాకా.. 5వేల మందికి రెండేసి ఓట్లు

Voting Irregularities in Guntur West Constituency :అశోక్‌నగర్‌ రెండోలైనులో ఓబుళశెట్టి సాంబశివరావు కుటుంబం ఇంటినంబరు 28-6-134లో నివసిస్తోంది. వీరికి నాలుగు ఓట్లు ఉండగా మూడు ఓట్లు 125వనంబరు బూత్‌లో ఉండగా కుమారుడు రామప్రణీత్‌ ఓటు 144వ బూత్‌లో వరుససంఖ్య 710గా నమోదయింది. ఇలా ఉండటం వల్ల ఒకే కుటుంబసభ్యులు వేర్వేరు బూత్‌లలో ఓటు వేయాల్సి రావటం ఇబ్బంది అవుతుందని వారు చెబుతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఓటరు జాబితాల్లో తప్పుల గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెదేపా ఇంఛార్జి కోవెలమూడి రవీంద్ర అంటున్నారు. ఈ అక్రమాలవెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారని ఆరోపించారు.

Bogus Votes in Andhra Pradesh :ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు రెండు చోట్ల ఉన్నాయి. మరికొందరు ఇక్కడి నుంచి వలస వెళ్లిపోయినా వారి ఓట్లు కొనసాగించారు. నగరపాలకసంస్థ కొత్త ఇంటినంబర్లు కేటాయించినా నూతన జాబితాలో కొందరు ఇప్పటికీ పాత ఇంటినంబర్లతో ఓటుహక్కు కలిగి ఉన్నారు. కొన్ని ఇంటినంబర్లు తప్పుగా ముద్రించడం వంటి తప్పిదాలు చోటుచేసుకున్నాయి. సీతారామయ్య పాఠశాల పక్కనే ఉన్న బహుళఅంతస్థుల భవనంలో ఉన్న నలుగురు ఓటర్లను 125వబూత్‌లో ఉన్నట్లు నమోదు చేశారు. తాము 126వ బూత్‌ పరిధిలోకి వస్తామని.. అక్కడకు మార్చాలని చెప్పినా పట్టించుకోలేదు. ఇలా జాబితా మారినా తప్పులు మాత్రం మారలేదని ఓటర్లు వాపోతున్నారు.

Bogus Votes in AP: ఇబ్బడిముబ్బడిగా బోగస్‌ ఓట్లు.. ఏ బూత్​ చూసినా అవే

Last Updated : Nov 4, 2023, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details