ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడో ఏట దూరమై... 38 ఏళ్ల తర్వాత కలుసుకొని.. - ap 2021 news

కూతురు సరిగ్గా చదవడం లేదని, తన స్నేహితుడి ఇంట్లో ఉంచి చదివిస్తే.. ఆమె బాగుపడుతుందనుకున్నాడు. వెంటనే ఆమెను తీసుకొచ్చి హైదరాబాద్​లోని స్నేహితుడి ఇంట్లో విడిచివెళ్లాడు. రెండ్రోజులు గడవకముందే తల్లిమీద బెంగతో ఎవరికీ చెప్పకుండానే ఇంటికెళ్లాలని బయటకొచ్చేసింది. ఆమె చేసిన ఆ చిన్న తప్పే 37 ఏళ్ల పాటు ఆమెను తన కుటుంబానికి దూరం చేసింది. చివరకు ఆమె అల్లుడి ద్వారా తన సోదరులను కలుసుకుంది. ఆ క్షణాన ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

MISSING GIRL MEET HER FAMILY AFTER 37 YEARS AT GUNTUR
ఏడో ఏట దూరమై.. 38 ఏళ్ల తర్వాత కలుసుకొని..

By

Published : Oct 30, 2021, 10:32 AM IST

Updated : Oct 30, 2021, 12:16 PM IST

ఏడో ఏట దూరమై.. 38 ఏళ్ల తర్వాత కలుసుకొని..

చిన్నప్పుడు తప్పిపోయి, మరో కుటుంబంలో సభ్యురాలిగా ఎదిగినా ఆమెకు తన రక్తసంబంధీకులను కలుసుకోవాలనే కోరిక అలాగే ఉండిపోయింది. అమ్మానాన్నలు, అక్కలు, సోదరులు గుర్తొచ్చినప్పుడల్లా మౌనంగా విలపించేది. 45ఏళ్ల వయసులోనూ ఆమె తన పుట్టింటివారిని తలచుకొని కన్నీరు పెట్టుకోవడాన్ని చూసిన ఆమె అల్లుడు.. ఎలాగైనా తన అత్తను ఆమె కుటుంబానికి దగ్గర చేయాలని సంకల్పించారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా సామాజిక మాధ్యమాల ఆసరాతో వారి జాడ తెలుసుకున్నారు. దాదాపు 38 ఏళ్ల నాడు దూరమైన తమ తోబుట్టువు ఫోన్‌ ద్వారా మాట్లాడడం, అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో ఆమె సోదరులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. హుటాహుటిన ఆమెను చూసేందుకు రెక్కలు కట్టుకొని వచ్చేశారు. అంతే.. ముగ్గురి కళ్ల నుంచి ఆనందబాష్పాలు ధారకట్టాయి. అమృతలూరు మండలం యలవర్రులో శుక్రవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది.

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా మదనాపూర్‌ మండలం నెలివెడి గ్రామానికి చెందిన క్యాసని నాగన్న, తారకమ్మ దంపతుల మూడో సంతానమైన మంగమ్మ తన ఏడో ఏట తండ్రితో కలిసి హైదరాబాద్​కు వచ్చింది. ఆమె సరిగ్గా చదవడం లేదని.. స్నేహితుడి దగ్గర ఉంచితేనైనా బాగా చదువుకుంటుందని అక్కడే వదిలివెళ్లిపోయాడు తండ్రి. మూడు రోజులు గడవకముందే అమ్మపై బెంగతో ఎవరికీ చెప్పకుండా తమ ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చింది. అలా రోడ్లపై తిరుగుతున్న ఆమెను చూసిన ఓ వృద్ధుడు తల్లి వద్దకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి, ఆమెకు అల్పాహారమిచ్చి రైలులో విజయవాడ తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను గుంటూరు జిల్లా వేమూరు మండలం జంపని తెలుగు బాప్టిస్టు చర్చి వద్దకు తీసుకొచ్చాడు. తన మాట వినడంలేదని పాపను ఆ వృద్ధుడు కొడుతుండడంతో అక్కడివారు ప్రశ్నించి, ఆ చిన్నారిని ఎత్తుకొచ్చాడని నిర్ధారించుకొని అతన్ని వెళ్లగొట్టారు.

చిన్నప్పుడు మా నాయన నేను సదువుకోవట్లేదని.. హైదరాబాద్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి హైదరాబాద్​లో వాళ్ల ఫ్రెండ్ ఇంటికాడ పెడ్తే.. నాకు మా తల్లిదండ్రులు, తమ్ముళ్లు కావాలనే ధ్యాసలోనే ఉండేదాన్ని. ఒకసారి బయటకెళ్లొచ్చేసరికి ఒక ముసలాయన నన్ను.. అరటికాయ అవి ఇచ్చాడు. నేను ఆయన వెంటపడి వెళ్లా. ఎనిమిది సంవత్సరాల గట్ర ఉంటయ్ అప్పుడు నాకు. ఇక ఆయన దగ్గర నుంచి జంపన్నలో ఒకాయన నన్ను దగ్గరకి తీశాడు. తీసి ఆలకు ఆరుగురు పిల్లలు. ఆరుగురు పిల్లలయితే, నాకు ఆరుగురు పిల్లలు.. నవ్ ఏడో పిల్లవి నేనే పెంచుకుంటానని తీసుకొచ్చి వాళ్లతో పాటే నన్నూ పెంచాడు. వేరే అబ్బాయికిచ్చి పెళ్లి కూడా చేశాడు. నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయికి పెళ్లి చేశాము. మా అల్లుడు... మీ అమ్మ ఏంది ఎప్పుడూ అట్ట బాధపడతా ఉంటదని మా కూతురిని అడిగాడంట. మా అమ్మ చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమైంది. మా అమ్మకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు అక్కలు... ఉండేవాళ్లంట అందరి పేర్లు చెబుతుంది, ఇంటి పేరు, ఊరి పేరు కూడా చెబుతుందని చెప్పిందంట. వాళ్ల ఆయన కనుక్కొని.. నా పుట్టిళ్లు వెతికి నా తమ్మళ్లిద్దరినీ రప్పిచ్చాడు మా ఇంటికి. ఇప్పుడు మేమందరం కలుసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది. - మంగమ్మ, తెలంగాణ నుంచి తప్పిపోయి వచ్చిన మహిళ.

అయితే పాప బాగోగులు చూసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామానికి చెందిన కనగాల సామేలు ఆ చిన్నారిని తన ఆరుగురు సంతానంతో పాటు పెంచి పెద్దచేశారు. తర్వాత కొల్లిపర మండలం దావులూరుకు చెందిన అంబటి దాసు అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. మంగమ్మ, దాసు దంపతులకు ఇద్దరు సంతానం కాగా, పెద్ద బిడ్డ శాంతకుమారిని యలవర్రుకి చెందిన కొండసీమ క్రిస్టఫర్‌కు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. అత్త తన రక్తసంబంధీకుల గురించి బాధపడుతుండడాన్ని చూసిన అల్లుడు ఫేస్‌బుక్‌ను ఆశ్రయించి, తెలంగాణలోని నెలివెడికి చెందిన భాస్కర్‌ అనే వ్యక్తి సహాయంతో ఆమె కుటుంబసభ్యుల వివరాలు సేకరించాడు. మూడు రోజుల క్రితం వారిని ఫోన్‌ ద్వారా సంప్రదించాడు. మంగమ్మ ఇద్దరు తమ్ముళ్లు వెంకటేష్‌, కృష్ణ శుక్రవారం యలవర్రు వచ్చి, వారి సోదరిని కలుసుకొని ఆనందసాగరంలో మునిగిపోయారు.

నా భార్య విషయం చెప్పాక.. నేను మా అత్తగారిని అడిగాను. అడిగితే ఆమె మదనాపురం, కొత్తకోట, అడ్డాకుల అని అడ్రస్ చెప్పింది. అయితే గూగుల్ మ్యాప్ ద్వారా చూశాన్నానేను. భాస్కర్ నాయుడు అనే ఓ వ్యక్తిని అప్రోచ్ అయ్యాను. ఆయన నంబర్ అడిగాను. అయితే అతను నంబర్ పంపించాడు. నంబర్ పంపిస్తే.. ఆ నంబర్​కు కాంటాక్ట్ అయి సో అండ్ సో పర్సన్ అండి.. ఇలాగ మిస్ అయిందని చెప్పాను. అవునండీ సో అండ్ సో పర్సన్ మిస్ అయింది... నేను ఈవినింగ్ కనుక్కుంటాను, అప్​డేట్​ చేస్తానని చెప్పాడు. చెప్తే నేను ఈవినింగ్ మాట్లాడాను ఆయనతో. అవునండి అని చెప్పి వాళ్లు, వీళ్లు వీడియో కాల్ ద్వారా మాట్లాడుకున్నారు. అవునని కన్ఫార్మ్ చేసుకున్నారు. - క్రిస్టోఫర్, మంగమ్మ పెద్ద అల్లుడు

  • తన కుటుంబసభ్యులను చూడకుండానే చనిపోతానేమోనని భావించానని, అయితే తన అల్లుడు వారిని తన వద్దకు చేర్చాడని ఆనందంతో చెప్తోంది మంగమ్మ. తన తల్లిదండ్రులు, తోబుట్టువులు, సోదరుల పేర్లు బాగా గుర్తుపెట్టుకున్నానని, వాటి ఆధారంగానే వారి జాడ తెలుసుకోవడం సాధ్యమైందని ఆమె పేర్కొంది.

35 నుంచి 40 సంవత్సరాల లోపు మా అక్క తప్పిపోయింది. ఇన్ని రోజుల బాధ పోయి ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. - వెంకటేష్, మంగమ్మ పెద్ద తమ్ముడు

  • తమ తల్లిదండ్రుల ద్వారా అక్క చిన్నతనంలో తప్పిపోయిందని తెలుసుకున్నామని, ఆమెను చూస్తామని అనుకోలేదని, 38 ఏళ్ల తర్వాత ఆమెను ఇలా కలుసుకోవడం పరమాద్భుతంగా ఉందని చెప్పారు ఆమె సోదరులు వెంకటేష్‌, కృష్ణ.

ఇదీ చూడండి:

BADVEL BY ELECTION POLLING: ప్రశాంతంగా సాగుతున్న బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్..

Last Updated : Oct 30, 2021, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details