ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హైకోర్టుకు వెళ్తేగానీ నా భర్త మృతదేహాన్ని చూపించలేదు' - గుంటూరు కరోనా వార్తలు

గుంటూరు జీజీహెచ్‌లో అదృశ్యమైన కరోనా రోగి ఆచూకీ ఎట్టకేలకు లభించింది. శవాగారంలో మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. హైకోర్టుకు వెళ్లాకే ఆస్పత్రి అధికారులు స్పందించారని మృతుడి భార్య వెంకాయమ్మ వెల్లడించారు.

guntur ggh
guntur ggh

By

Published : Jul 30, 2020, 11:10 PM IST

గుంటూరు సర్వజనాస్పత్రి(జీజీహెచ్​)లో అదృశ్యమైన కరోనా బాధితుడి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. బాధితుడు జీజీహెచ్​లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. జీజీహెచ్ మార్చురీలోని మృతదేహాన్ని మృతుడి భార్య వెంకాయమ్మ, మృతుడి సోదరి ధ్రువీకరించారు.

కొవిడ్ చికిత్స కోసం ఈ నెల 14న తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకాయమ్మ భర్త చేరారు. మెరుగైన వైద్య సదుపాయం నిమిత్తం 16 రాత్రి జీజీహెచ్‌కు తరలించారు. ఆ తర్వాత వెంకాయమ్మ భర్త కనిపించలేదు. ఆసుపత్రిలో ఎన్ని వార్డులు తిరిగినా... ఎంత మందిని అతని భార్య అడిగినా సమాధానం చెప్పేవారు లేరు. జీజీహెచ్ అధికారులను అడిగినా ఫలితం లేకుండాపోయింది. తన భర్త ఎక్కడున్నారో జీజీహెచ్‌, తెనాలి ప్రభుత్వాసుపత్రి అధికారులు చెప్పడం లేదంటూ వెంకాయమ్మ బుధవారం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎట్టకేలకు అతని ఆచూకీ గురువారం లభ్యమైంది.

మరోవైపు జీజీహెచ్​ సిబ్బంది తీరును మృతుడి భార్య వెంకాయమ్మ తీవ్రంగా తప్పుబట్టారు. తన భర్త ఆచూకీ తెలియక 14 రోజులు మనోవేదనకు గురయ్యానని ఆమె తెలిపారు. జీజీహెచ్ అధికారులు తమ ఆందోళన పట్టించుకోలేదని దుయ్యబట్టారు. హైకోర్టుకు వెళ్లాకే ఆస్పత్రి అధికారులు స్పందించారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

కొవిడ్ ఆస్పత్రిలో నా భర్త అదృశ్యమయ్యాడు: హైకోర్టుకు మహిళ

ABOUT THE AUTHOR

...view details