కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. ఆ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఎజెండాగా అమలు చేయాలని సూచించారు. గుంటూరులోని సుగంధ ద్రవ్యాల బోర్డు కార్యాలయంలో.. మిర్చి యార్డు అధికారులు, వ్యాపారులతో ఆయన సమావేశమయ్యారు.
మిర్చిని ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తే రైతులకు మరింత లాభదాయకమన్నారు. రాష్ట్రం నుంచి మిర్చి ఎగుమతులు పెంచి.. రైతులకు లాభాలు వచ్చేలా సమాలోచన చేసినట్లు వెల్లడించారు. చీడపీడలు తప్పించుకునేలా మిర్చిలో కొత్త రకాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు మెరుగైన వ్యవసాయ విధానాలు అనుసరించేలా అవగాహన కల్పిస్తామని తెలిపారు.