ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శీతల గిడ్డంగుల యజమానుల నిర్లక్ష్యం.. మిర్చి రైతుల ఆందోళన - గుంటూరులో మిర్చి రైతుల ఆందోళన

శీతల గిడ్డంగుల యజమానుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. . గిడ్డంగుల్లో సరైన నిర్వహణ లేని కారణంగా మిర్చి పాడైపోతోంది. గిడ్డంగుల్లో ఏసీలు పనిచేయకపోవడంతో దాచుకున్న మిర్చి.. పాడైపోయిందని రైతులు ఆందోళనకు దిగారు. ఏడాది కష్టం గోదాము పాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శీతల గోదాముల వ్యవస్థపై నియంత్రణ లేకపోవటమే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది.

mirchi farmers protest in guntur
mirchi farmers protest in guntur

By

Published : Jun 2, 2020, 2:07 PM IST

రాష్ట్రంలో అత్యధికంగా మిర్చి పంట గుంటూరు జిల్లాలో లక్షా 50 వేల ఎకరాల్లో సాగవుతోంది. రైతులు ప్రతిఏటా ఈ మిర్చిని గుంటూరులోని యార్డుకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. సరైన ధర లేకపోతే శీతల గోదాముల్లో నిల్వ ఉంచుకుని... మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటారు. అయితే ఈసారి లాక్ డౌన్ కారణంగా మిర్చియార్డును 2నెలల పాటు మూసివేశారు. దీంతో రైతులు తమ పంటను ఇళ్లలో, శీతల గోదాముల్లో తప్పనిసరిగా దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మార్చి 23 నుంచి మిర్చి యార్డు మూసివేశారు. అంతకు ముందు దాదాపు రెండు నెలలు మాత్రమే రైతులు పంట విక్రయించుకున్నారు. మిగతా సరుకంతా శీతల గిడ్డంగుల్లోనే భద్రపర్చుకున్నారు. జిల్లాలో 120 గోదాములున్నాయి. వాటిలో కోటి బస్తాల మేర సరకు గోదాముల్లోనే ఉంది. మిర్చి పాడైపోకుండా శీతల గిడ్డంగుల్లో సరైన ఉష్ణోగ్రతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏసీ కంపార్ట్ మెంట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఈ విషయంలో కొందరు శీతల గిడ్డంగుల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ దాచుకున్న పంట పాడైపోయింది.

రాజుపాలెం మండలం రెడ్డిగూడంలో వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజిలో వారం రోజుల క్రితం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 20వేల మిర్చి బస్తాలు పాడైపోవటంతో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. అయినా యజమానులు స్పందించలేదు. తాజాగా ఫిరంగిపురంలోని సిరి శ్రీ సిరి కోల్డ్ స్టోరేజిలో ఇలాంటి సమస్యే వచ్చింది. అక్కడ 40వేల బస్తాల మిర్చి పంట పాడైపోయింది. ఇక్కడ రైతులు ఆందోళనకు దిగారు.

బాధిత రైతు

'తిండి, నిద్ర మాని కష్టపడి పండించుకున్న పంటయ్యా.. ఇలా ఏసీలు ఆపి మా పంటను అంతా పాడుచేశారు. కొందరి పంటను తెలియకుండా అమ్మేసుకున్నారు. ఎవరూ ఈ విషయంపై స్పందించడంలేదు. మాగోడు ఎవరితో చెప్పుకోవాలి. అధికారులు స్పందించి పాడైపోయిన మిర్చికి పరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నాం" - బాధిత రైతు

శీతల గిడ్డంగుల నిర్మాణానికి ఉద్యాన శాఖ కోటి రూపాయల మేర రాయితీ ఇస్తోంది. అలాగే మార్కెటింగ్ శాఖ లైసెన్స్ తప్పనిసరి. ఇక అగ్నిమాపకశాఖ, విద్యుత్, పరిశ్రమల శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకుంటారు. ఇన్ని శాఖలు ఉండి.. శీతల గిడ్డంగులపై నియంత్రణ లేని దుస్థితి. ఎవరికి వారు మౌనంగా ఉండటంతో గోదాములపై పర్యవేక్షణ లేదు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు యజమానులపై చర్యలు ఉండవు. అలాగే రైతులకు పరిహారం రావటం లేదు. కొందరు శీతల గిడ్డంగుల యజమానులు విద్యుత్ బిల్లులు తగ్గించుకునే క్రమంలో ఏసీలు ఆపుతారు. మరికొందరు కొన్ని కంపార్టుమెంట్లను ఏసీ వదిలి.. మరికొన్నింటికి సరఫరా నిలిపివేస్తారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు ఆపటం సమస్యకు కారణమవుతోంది. దీంతో అక్కడ దాచుకున్న మిర్చి పాడైపోయి రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరికొందరైతే రైతులకు తెలియకుండా మిర్చి పంట విక్రయించిన సందర్భాలున్నాయి.

బీమా సొమ్ము కోసం మిర్చి గోదాములకు నిప్పుపెట్టిన ఘటనలు గతంలో గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్నాయి. కానీ ఇలా నిర్లక్ష్యంగా పంటను పాడు చేసిన సందర్భాలు ఇటీవల వెలుగుచూస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవటం రైతుల్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా పాజిటివ్‌ కేసులు

ABOUT THE AUTHOR

...view details