Ministers Committee Meeting With Govt Employees Unions: మంత్రుల కమిటీ.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో జరిపిన చర్చల్లో.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(C.P.S) రద్దుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. గతంలో ప్రకటించినట్లే గ్యారెంటీ పెన్షన్ స్కీమ్-G.P.S అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. CPS ఉద్యోగులకు 33 శాతం గ్యారెంటీ పెన్షన్ ఉండేలా G.P.Sలో కొన్ని మార్పులు ఉంటాయని.. దీనిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
ద్రవ్యోల్బణాన్ని అనుసరించి మార్పు చేసేలా ఆలోచిస్తున్నట్లు మంత్రుల కమిటీ తెలిపింది. C.P.S రద్దు చేస్తామని ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారని.. P.RC. బకాయిలను నాలుగు సంవత్సరాలలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పిందని ఉద్యోగ సంఘాల నాయకులు గుర్తు చేశారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీ బకాయిలు కలిపి 7 వేల కోట్ల రూపాయలకు పైగా ఉండగా.. వాటిని 2027 వరకు చెల్లిస్తామని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విధించిన నిబంధనల వల్ల చాలా మంది అర్హత కోల్పోతున్నారని మంత్రుల కమిటీకి వివరించారు. పీఆర్సీ ఛైర్మన్‌గా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను నియమిస్తామని మంత్రుల కమిటీ ప్రతిపాదించగా.. ఉద్యోగ సంఘాల నాయకులు అందుకు తిరస్కరించారు. ఆయన సీఎస్‌గా ఉన్నప్పుడే 11వ పీఆర్సీలో అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఆదిత్యనాథ్‌దాస్‌ను నియమించాలని కొందరు ఉద్యోగులు ప్రతిపాదించారు.
సీపీఎస్ ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్ ఇచ్చేలా-G.P.Sకు తుది మెరుగులు దిద్దుతున్నామని.. సమావేశం తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 2014 జూన్ 2 నాటికి ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నవారిని క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. సొసైటీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 62సంవత్సరాలకు పెంచడంపై కోర్టులో కేసులున్నాయని.. వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
గత పీఆర్సీలో స్పెషల్-పే ఇచ్చేందుకు అనుమతించామని తెలిపారు. కొత్త జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్ఆర్ఏ అమలు చేస్తామని వివరించారు. పీఆర్సీ, డీఏ బకాయిలను నాలుగు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం నాలుగు వాయిదాల చొప్పున చెల్లిస్తామని చెప్పారు. వైద్య విధాన పరిషత్తు సిబ్బందికి “010” కింద జీతాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కేబినెట్‌లో పెట్టిన తర్వాత ఆయా విభాగాలు ఉత్తర్వులు ఇస్తాయన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కొంతమేర ఆలస్యం జరిగిందని మంత్రి బొత్స తెలిపారు.