MINISTERS COMIITTEE MEETING WITH EMPLOYEES : ఉద్యోగుల సమస్యలపై ఈనెల 9 నుంచి ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగుల సంఘం దశల వారీగా ఆందోళనకు పిలుపునివ్వడంతో.. ప్రభుత్వం హడావిడిగా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు ప్రారంభించింది. మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహదారు సజ్జల, ఉద్యోగ సంఘాల నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. D.A. బకాయిలు, ఏపీ G.L.I సహా పెండింగ్ అంశాలపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చినందునే ప్రభుత్వం ఈ అనధికార సమావేశం నిర్వహించిందని.. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం ఆరోపించింది. డీఏ బకాయిలు, వేతనాలు సకాలంలో చెల్లించకుండా.. ఉద్యోగులను చులకన చేస్తున్నారని ఆక్షేపించింది. ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తే తప్ప.. ఈనెల 9 నుంచి నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
"ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. పీఆర్సీని రిటైర్మెంట్ అప్పుడు ఇస్తామంటే ఒప్పుకున్నాం. పీఆర్సీ అలవెన్సుల మీద నిర్ణయం తీసుకోవడానికి ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. ఎందుకు మమ్మల్ని చులకన చేసే విధంగా జీతభత్యాలు ఆలస్యంగా ఇస్తున్నారు. మా కోసం కేటాయించిన బడ్జెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాం. ఉద్యమ కార్యాచరణ నిర్ణయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అధికారికంగా పెట్టే సమావేశంలో లిఖిత పూర్వక సమాధానం ఇస్తే తప్పు మేము వెనక్కి తగ్గం"-బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్