MINISTER VIDADALA RAJINI : ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానం అమల్లో భాగంగా వైద్యులు అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను తప్పకుండా సందర్శించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. ఈ పథకం విస్తరణలో భాగంగా త్వరలో 260 అంబులెన్సులు అందుబాటులోనికి రాబోతున్నాయని తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
నెలకు వేతనం కింద రూ.3 లక్షల వరకు వైద్యులకు ‘బిడ్డింగ్’ విధానంలో చెల్లించే విధానం చేపట్టడం వల్ల మారుమూల ప్రాంతాల్లో సైతం వైద్య సేవలు మెరుగుపడుతున్నాయని అన్నారు. డైట్ ఛార్జీలను రూ.40 నుంచి రూ.80కి పెంచినందున రోగులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియలో భాగంగా త్వరలో జాతీయ వైద్య బృందాలు తనిఖీలకు రానున్నట్లు తెలిపారు.