'తెదేపా స్లీపర్ సెల్స్ కరోనా వ్యాప్తి చేస్తున్నాయేమో?' - కరోనా వ్యాప్తిపై మంత్రి మోపిదేవి వ్యాఖ్యలు
రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెదేపా కార్యకర్తలే కరోనా వ్యాప్తికి కుట్ర పన్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కరోనాను తెదేపా స్లీపర్ సెల్స్ వ్యాప్తి చేస్తున్నాయా అని అనుమానం కలుగుతోందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కరోనాపై ప్రభుత్వం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత అన్నింటినీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆర్బాటం అంతా ప్రచారం కోసమే అని మంత్రి అన్నారు. రాజధాని కోసం రైతులు, ప్రజల నుంచి జోలి పట్టిన నిధులు ఏమయ్యాయని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలను ఆదుకోవటంలో చంద్రబాబు ఎందుకు సహకరించటం లేదని విమర్శించారు. కరోనాను తెదేపా- వైకాపా సమస్యగానే చూడొద్దని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయబట్టే అక్కడ వైరస్ సోకిందంటూ ఆరోపించటం శోచనీయమన్నారు. కరోనా టెస్టింగ్ కిట్ల వ్యవహారంలో పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసిన ధరకే మనకూ సరఫరా చేయాలని సదరు కంపెనీకి ముందే స్పష్టం చేశామన్నారు. ఇప్పుడు దానిపై ఈ విచారణ అవసరమేముందని అన్నారు.