Minister KTR visited Hujurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, హుజూర్‌నగర్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.
కేంద్రం నిధులను పక్కదారి పట్టించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ నిధులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారని, ఇది తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో భవిష్యత్ తరాల కోసం పెట్టుబడులు పెడుతోందని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు.
బీజేపీ సర్కార్ చేసిన 100లక్షల కోట్ల అప్పుతో చేసిన ఒక్క మంచి పని, బాగుపడ్డ ఒక్క వర్గం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని దేశ దిక్సూచిగా పెట్టేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారు తప్ప.. జెండా, అజెండా మారలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పేరుమారింది తప్ప పనితీరు మారలేదని ఉద్ఘాటించారు. అనంతరం మునుగోడు నియోజకవర్గం చండూర్‌లో 40కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు.