రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నామని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆర్థికమాంద్య పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న వేళ.... నైపుణ్యావృద్ధి, సంపద సృష్టించే పరిశ్రమలు భవిష్యత్తులో అవసరమని నొక్కిచెప్పారు. రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులను గట్టిక్కించేందుకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని చెప్పారు. గుంటూరు బృంజావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి ఆలయ ఆడిటోరియంలో ఏపీ స్నిన్నింగ్ మిల్లుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి గౌతంరెడ్డి, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సన్మానం నిర్వహించారు. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న 250 కోట్ల రూపాయల మేరకు రాయితీ ప్రోత్సాహకాల్ని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో బ్యాంకు రుణాల విషయంలోనూ పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే కౌంటర్ గ్యారంటీ ఇచ్చేందుకు యోచిస్తుందని మంత్రి గౌతం రెడ్డి భరోసా ఇచ్చారు. స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులకు అదనంగా వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల దిశగా యాజమాన్యాలు ఆలోచన చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి సూచించారు.
అమరావతే రాజధానిగా ఉంటుంది: మంత్రి గౌతమ్ రెడ్డి - spinning, and jinning mills
రాజధానిపై ఎలాంటి గందరగోళం లేదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. అమరావతియే రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే నష్టాల్లో ఉన్న స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులను గట్టిక్కించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
రాజధానిపై గందరగోళం లేదు
రాష్ట్ర రాజధానిగా అమరావతియే ఉంటుదని ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం అమరావతికే మద్దతు పలికామని మీడియా ప్రతినిధులతో అన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు సైతం సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ఆశయమని చెప్పారు. పల్నాడులో ప్రస్తుత పరిస్థితిపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు స్పందిస్తూ.... గతంలో నరసరావుపేటలో ఏమి జరిగేదో ప్రజలకు తెలుసన్నారు. చేసిన పాపాలే వారిని వెంటాడుతున్నాయని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. శాంతిభద్రతల పరిరక్షణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని..అధికార యంత్రాంగానికే పూర్తి స్వేచ్ఛనిస్తుందని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.