మాచర్ల పేరు, రామకృష్ణా రెడ్డి పేరు వింటేనే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భయంతో గుండెల్లో రైళ్లు పరిగెడతాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు అన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్, కౌన్సిలర్ల అభినందన సభకు హాజరై ప్రసంగించిన ఆయన.. ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు నాయడు గుంటూరు అభివృద్ధి గురించి మాట్లాడకుండా.. మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి గురించి మాట్లాడటాన్ని బట్టి.. విషయం అర్థమవుతుందన్నారు.
నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా...
పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. తురక కిషోర్ పడిన కష్టానికి న్యాయం చేశామన్న ఆయన కిషోర్ పై ఎక్కడైనా రౌడీషీట్ ఉందని చంద్రబాబు నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వడ్డెర్లకు తాము సముచిత గౌరవం ఇచ్చి పదవులు ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఛైర్మన్, కౌన్సిలర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర యువజన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, వడ్డెర సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...