MINISTER BOTSA FIRES ON PAWAN : రాజకీయ వ్యవస్థకు పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి ఉండటం దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జనసేన రాజకీయ పార్టీ కాదు.. సెలబ్రిటీ పార్టీ అని వ్యాఖ్యానించారు. నోరు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడకూడదని పవన్‌కు హితవు పలికారు. పవన్‌కల్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని విమర్శలు వస్తుంటే.. వాటిని కాదని నిరూపించుకోవాలన్నారు. పవన్‌కే కాదు అందరికీ చెప్పులు ఉంటాయన్న సంగతి గుర్తు ఉంచుకోవాలన్నారు. జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేస్తే చర్యలు తీసుకోకూడదా అని ప్రశ్నించారు.
విశాఖలో ఊరేగింపు వద్దు.. సభ చేసుకోమని పోలీసులు చెప్పారని గుర్తు చేశారు. పవన్ వచ్చిన రోజు తానే ట్రాఫిక్‌లో గంటన్నర సేపు రోడ్డుపై ఆగిపోయానన్నారు. విశాఖ ఉక్కును ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని.. పవన్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నిన్న పవన్ మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుందని.. కానీ మాకు సంస్కారం ఉంది కాబట్టి మౌనంగా ఉన్నామన్నారు. చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చారు.. కానీ ఎప్పుడైనా ఇలా మాట్లాడారా అన్నారు. చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందన్నారు. నిన్న రాజమండ్రిలో అమరావతి రైతుల పాదయాత్రలో జరిగిన ఘటనలో వైకాపా ఎంపీని, రైతులను ఇద్దరినీ సమర్ధించనని బొత్స అన్నారు.