రాజధాని విస్తరించిన పరిధికి, రాజధానికి తేడా తెలియని విధంగా బొత్సలాంటి సీనియర్ మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెదేపా నేత సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. నిన్నటి సీఎం సీఆర్డీఏ సమీక్షలో జగన్ నిర్ణయం ఏమిటా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తే.. ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రాజధానిపై బొత్స మాటలు అనువాదం చేయించినా అర్థం కావని విమర్శించారు.
బొత్స ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదు... - tdp vs ycp
రాజధానిపై సీఎం జగన్ నిర్ణయం చెప్తారని అందరూ ఎదురుచూస్తుండగా మళ్లీ మంత్రి బొత్సనే మాట్లాడారని తెదేపా నేత సోమిరెడ్డి విమర్శించారు. రాజధానిపై మంత్రి మాటలు అనువాదం చేయించినా ఎవరికీ అర్ధం కావన్నారు. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌పై బొత్స చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు చెందిన ఓ సంస్థకు తెదేపా హయాంలో భారీగా భూ కేటాయింపులు జరిగాయని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి మండిపడ్డారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో బొత్స మంత్రిగా ఉన్నప్పుడే ఆ భూముల ఎంవోయూ జరిగిందని స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో ఆ సంస్థకు భూమి బదిలీ జరగలేదని.. ప్రస్తుతం ఆ భూములు ప్రభుత్వ హయాంలోనే ఉన్నాయని వెల్లడించారు. బాలకృష్ణ అల్లుడు కాబట్టి ఏదో ఒక నింద మోపాలని చూడటం తగదని హితవు పలికారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని లేకుంటే క్షమాపణలు చెప్పాలని బొత్సకు సోమిరెడ్డి సవాల్ విసిరారు.