అమరావతిపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని... మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన..... శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు చదవాలని సూచించారు. పాలనా వికేంద్రీకరణ ఉండాలని శివరామకృష్ణన్ కమిటీ నివేదిక చెప్పిందని వివరించారు. పంటలున్న చోట భవనాలు వద్దని ఆ కమిటీ నివేదిక చెప్పిన విషయం గుర్తుచేశారు. నాట్ ఫీజబుల్ అనే మాట వాడిందా లేదా... చంద్రబాబు చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.
3వేల కోట్లు ఎలా సరిపోతాయి..?
అమరావతిలో ఖర్చు పెట్టిన నిధులపై చంద్రబాబు చెప్పేవి అసత్యాలని మంత్రి బొత్స ఆరోపించారు. 'అమరావతిలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు అన్నారు. మరో 3 వేల కోట్లు ఖర్చు చేస్తే రాజధాని పూర్తవుతుందని అన్నారు. మరి రూ.52 వేల కోట్లకు టెండర్లు ఎందుకు పిలిచారు..? అని ప్రశ్నించారు. అమరావతి రోడ్ల కోసం రూ.19,769 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇన్నిచేసి కేవలం 3 వేల కోట్లు సరిపోతాయని చంద్రబాబు ఎలా చెబుతారని నిలదీశారు. వందల ఏళ్ల సిటీ కనుకే హైటెక్ సిటీతో హైదరాబాద్ ఎలివేట్ అయ్యింది. అమరావతిలో ఒక టౌన్‌షిప్ కట్టి రాజధాని అభివృద్ధి అంటే ఎలా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఐదేళ్లలో రూ.1.96 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆయన చేసిన తప్పులను సీఎం జగన్ సరిదిద్దుతున్నారని బొత్స పేర్కొన్నారు.
వాళ్లకు చేస్తే మంచివాళ్లా..?
ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉన్న సంస్థ.. బీసీజీ. బీసీజీది పనికిమాలిన నివేదికని చంద్రబాబు అన్నారు. చాలా దేశాల్లో చంద్రబాబు నిర్వహించిన వ్యవహారాలకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ బీసీజీనే. ఇప్పడు ఆయనే దాన్ని తప్పు పడుతున్నారు. వాళ్లకు చేస్తే మంచివాళ్లు.. ఇతరులకు చేస్తే అవినీతిపరులా..?. నితిఆయోగ్‌కు కూడా బీసీజీ సలహాలు, సూచనలు ఇచ్చింది. చంద్రబాబు చేసేవన్నీ అవినీతి పనులు.. చెప్పేవన్నీ నీతులు.
-బొత్స సత్యనారాయణ