MINING IN GUNUTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. పల్నాడు, డెల్టా ప్రాంతం ఏదైనా సరే.. అధికారం అండగా వైకాపా నేతలు అనధికార తవ్వకాల దందా సాగిస్తున్నారు. గ్రామాల్లో మంచినీరు అందించే చెరువులు.. మైనింగ్ మాఫియా దాష్టీకాలకు కరిగిపోతున్నాయి. అడ్డగోలు తవ్వకాలను ప్రశ్నించిన గ్రామస్థులపైనా దాడులకు తెగబడుతున్నారు. ట్రాక్టర్లతో తొక్కిస్తామని, పోలీసు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. విపక్ష ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్తే అడ్డుకుంటున్నారు. పెదకాకాని మండలం అనుమర్లపూడిలో సోమవారం మట్టి తవ్వకాల పరిశీలనకు వెళ్లిన తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్రను.. స్థానిక వైకాపా నాయకులు అడ్డగించారు. ఆయన వాహనంపైనా దాడికి పాల్పడ్డారు.
మే 24న చేబ్రోలు మండలం శేకూరులోనూ ఇదే తరహాలో నరేంద్రను అడ్డుకున్నారు. మండల పరిధిలోని 8 గ్రామాల్లో మట్టి తవ్వకాలపై ఫిబ్రవరి 10న సుద్దపల్లి క్వారీలో నిరసనకు దిగిన నరేంద్ర.. రాత్రంతా అక్కడే నిద్రించారు. ఆ తర్వాత క్వారీ స్థలాన్ని పరిశీలించిన గనులశాఖ అధికారులు.. అక్రమాలు నిజమేనని తేల్చారు. అయితే జరిమానాలతో సరిపెట్టారు. ఆ తర్వాత యథావిధిగా మట్టి మాఫియా తవ్వకాలు కొనసాగిస్తూనే ఉంది.
చుండూరు, అమర్తలూరు మండలాల్లో మే 31న పర్యటించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.. చెరువుల్లో మట్టి తవ్వకాలను పరిశీలించారు. ఒక్కోచోట 30 నుంచి 40 అడుగుల మేర తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. అప్పట్లో వైకాపా నేతలు ఆయన్ను అడ్డుకున్నారు. మట్టి అక్రమ తవ్వకాల పరిశీలనకు ఆనందబాబును తీసుకొచ్చారనే కక్షతో... సోమవారం అధికార పార్టీ వర్గీయులు రెచ్చిపోయారు. నక్కా లక్ష్మయ్య అనే వ్యక్తిపై తీవ్రస్థాయిలో దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న లక్ష్మయ్యను చెరువు వద్దకు తీసుకెళ్లి కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. తలపై ఐదు బలమైన గాయాలైనట్లు బంధువులు తెలిపారు.