గుంటూరు జిల్లాలో మిర్చికోతలకు వచ్చిన వలసకూలీలు సొంతూళ్లకు పంపించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 28వతేదీ నుంచి వరుసగా వందల బస్సుల్లో కూలీల స్వస్థలాలకు పంపుతున్నారు. మార్చి 22 నుంచి లాక్డౌన్ అమలులోకి రావడం వల్ల కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి మిర్చికోతలకు వలస వచ్చిన కూలీలు జిల్లాలోనే ఉండిపోయారు. ఇక్కడి పనులు పూర్తి కావడం వల్ల కొన్నాళ్లుగా కూలీలు తమను సొంతూరికి పంపాలని అధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం వలసకూలీల తరలింపునకు ఎట్టకేలకు మార్గదర్శకాలు విడుదల చేయడం వల్ల బస్సుల ద్వారా 25300 మందిని సొంతూళ్లకు పంపించారు. గురువారం రాత్రి వరకు 611 బస్సుల ద్వారా 19 వేల మందిని పంపారు. శుక్రవారం 199 బస్సుల ద్వారా 6 వేల మందిని కర్నూలు జిల్లాకు పంపగా... 10 బస్సుల్లో 300 మందిని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పంపించారు. ఇవి కాకుండా కర్నూలు జిల్లా నుంచి 200 బస్సులు వచ్చి ఇక్కడి వలసకూలీలను తీసుకెళ్లాయి. రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు వచ్చి వెంటనే బస్సులు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ప్రాంతీయ మేనేజరు రాఘవకుమార్ తెలిపారు.
విజయపురిసౌత్