గుంటూరు జిల్లాలో మిర్చి కోతల కోసం కర్నూలు, అనంతపురం ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 30 వేల మంది చిక్కుకుపోయారు. వీరిలో కొందరికి మాత్రమే పని లభిస్తోంది. అత్యధిక శాతం మంది ఖాళీగా ఉంటున్నారు. వీరంతా పిల్లల్ని, వృద్ధులైన తల్లిదండ్రుల్ని గ్రామాల్లో వదిలి వలస వచ్చారు. అప్పుడప్పుడూ వారి సొంత గ్రామాలకు వెళ్లి తాము సంపాదించిన కూలీ డబ్బులతో సరకులు కొని వారికి అందించి, బాగోగులు చూసి తిరిగి వస్తుంటారు. లాక్‌డౌన్‌తో ఆ అవకాశం లేకుండాపోయింది.
అత్యధిక శాతం మంది రైతుల పొలాల్లో గుడారాలు వేసుకుని ఇబ్బందుల మధ్యే జీవిస్తున్నారు. నిత్యావసరాలు సమకూర్చుకునేందుకూ డబ్బులు లేక.. దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందించే సాయంతో గడుపుతున్నారు. కొన్ని చోట్ల రైతులే వీరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. పోర్టబిలిటీ విధానం ద్వారా కొంతమంది రేషన్ సరకులు తీసుకోగలిగారు. వట్టిచెరుకూరు మండలంలో 6 వేల మంది, ప్రత్తిపాడు మండలంలో 6,450 మంది, గురజాల మండలంలో 5 వేల మంది, బొల్లాపల్లి మండలంలో 3,963 మంది మేడికొండూరు మండలంలో 2,600 మంది ఇలా ఎక్కడ చూసినా వేల మంది వలస కూలీల కష్టాలే కనిపిస్తున్నాయి.
ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు విజయనగరం జిల్లా నుంచి వచ్చిన దాదాపు 200 మంది కూలీలు వీరవాసరం మండలంలో ఇరుక్కుపోయారు. బట్టి యజమానులు చేసిన సాయంతో ఇన్నాళ్లు గడిపిన కూలీలు.. ఇప్పుడు చేతిలో డబ్బులు లేక నిత్యావసరాలు కొనేందుకూ ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో... రాబోయే రోజుల్లో ఎలా గడపాలో? తిండి ఎలా సమకూర్చుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నామని అప్పలరాజు అనే కార్మికుడు వాపోయారు.
- కడప జిల్లా రైల్వేకోడూరులో వ్యవసాయ, భవన నిర్మాణ పనులు, హమాలీ పనులు చేసుకునే కర్నూలు, అనంతపురం వలస కూలీలు 200 మంది వరకూ అక్కడ చిక్కుకుపోయారు.
- గ్యాస్‌స్టవ్‌ల మరమ్మతులు, కత్తులు సానపెట్టటం తదితర పనులు కోసం గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతం నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన దాదాపు 40 మంది అక్కడ ఉండిపోయారు. వీరికి ఎలాంటి సాయమూ అందట్లేదు.
- గ్యాస్‌పైపులైను పనులు చేపట్టటం కోసం వచ్చిన 90 మంది విశాఖ జిల్లా వలస కూలీలు అమలాపురంలో ఇరుక్కుపోయారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
పిల్లలు ఎలా ఉన్నారో?