Rainfall Indications: ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి కేరళ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్‌లోని ఈశాన్య ప్రాంతాల నుంచి తమిళనాడు వరకూ ఏపీ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్లు స్పష్టం చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడడక్కడా మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.
మండుతున్న ఎండలు: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీచే సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలో వేర్వేరు చోట్ల 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ధవళేశ్వరంలో 43.25 డిగ్రీల సెల్సియస్, నంద్యాల జిల్లా రుద్రవరంలో 43.18, రాజమహేంద్రవరం 42.6, పొన్నూరు 42.5, పార్వతీపురం మన్యం 42.3, శ్రీకాకుళం జిల్లా పలాస 42.36, విజయనగరం 42.35, ఏలూరు 42.27, బాపట్ల 42.24, విజయనగరం 42.19, కడప 42.09, అనకాపల్లి 42.01, నంద్యాల 42.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.