Australian MPs met CM Jagan: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు, వాణిజ్య ప్రతినిధుల బృందం సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. వారంతా అక్కడి లేబర్‌పార్టీ సభ్యులు. ఇంధనం, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో రెండు రాష్ట్రాలు పరస్పరం కలసి పని చేసేందుకున్న అవకాశాలపై ఆ బృందం చర్చించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
చర్చలు సానుకూల వాతావరణంలో జరగడంపై బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపింది. విద్యా విధానాల పరంగా తమ రాష్ట్రంతో చాలా సారూప్యతలు ఉన్నట్లు.. సమావేశం తర్వాత ఆస్ట్రేలియా ప్రతినిధులు తెలిపారు. ఎనర్జీ, విద్య , నైపుణ్యాభివృద్ధి రంగాలపై ఏపీ చొరవలను ఎంపీలు ప్రశంసించారు. కొన్ని అంశాల్లో పరస్పర సహకారం చేసుకోవడం సహా ఇంధన పునరుత్పాదకతపై చర్చించినట్లు వెల్లడించారు. పవన, సౌరశక్తి పరంగా ప్రభుత్వం చేపట్టిన ఆసక్తికరమైన కార్యక్రమాల గురించి తెలుసుకున్నట్లు ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ పార్లమెంటు సభ్యుల బృందం చెప్పారు.