Spoiled Medicine: గుంటూరు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్)లో రూ.కోట్ల విలువ చేసే ఉచిత మందులకు చెద పట్టింది. వినియోగ గడువు ముగియడంతో వాటిని నేలపాలు చేయటానికి రంగం సిద్ధం చేశారు. ఈ భవనం మందుల పెట్టెలతో నిండింది. ఇంకా మిగిలి ఉన్న మందులను అమరావతి రోడ్డులోని మెడికల్ కాలేజీ హాస్టల్‌లో కొన్ని గదుల్లో అడ్డదిడ్డంగా పడేశారు. వీటిల్లో గడువు తీరినవి తెలియక ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. 2019, 2020లలో కొనుగోలు చేసిన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, సిరంజీలు, సెలైన్ బాటిళ్లు, రక్తం గడ్డకట్టకుండా ద్రవ రూపంలో ఇచ్చే లిక్విడ్ మందులు, పీపీఈ కిట్లు, ఆఫ్రాన్లు, సర్జికల్స్ అన్నీ వృథాగా మారాయి.
ఈ-ఔషధి ఉన్నా..:ఆసుపత్రులకు కావాల్సిన ఉచిత ఔషధాలు, సర్జికల్స్ ప్రతిదీ ఈ-ఔషధి సైట్‌లో అప్‌లోడ్ చేసి పంపుతారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏ మందులున్నాయి? ఇంకా ఏం కావాలి? మిగులు ఉన్నవాటిని ఎక్కడికి సర్దుబాటు చేయొచ్చో వైద్య, మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) అధికారులకు తెలుస్తుంది. ఆసుపత్రులకు వారు పంపిణీ చేయకుండా సీడీఎస్‌లో నిల్వచేసి వినియోగానికి పనికిరాకుండా చేశారనే విమర్శలున్నాయి. వాటి విలువ రూ.కోట్లలోనే ఉంటుందని అంచనా.