Margadarsi Lawyers to Court: ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని మార్గదర్శి కేంద్ర కార్యాలయంలోకి హఠాత్తుగా చొరబడి సోదాలు నిర్వహిస్తున్నారని మార్గదర్శి తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. బలవంతంగా చొరబడి సోదాలతో పాటు సమాచార సేకరణ పేరుతో కేసుతో సంబంధం లేని ఇతర రాష్ట్రాల సమాచారాన్ని సేకరిస్తున్నారని, దీనికి చట్టం అనుమతించదని తెలిపారు.
హైకోర్టు ఉత్తర్వులున్నా.. బుధవారం మధ్యాహ్నం ఏపీ అధికారులు హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సోదాలు మొదలుపెట్టడంతో మార్గదర్శి అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించింది. మౌఖిక విజ్ఞప్తిని అత్యవసర పిటిషన్‌గా పరిగణించి విచారించేందుకు సింగిల్ జడ్జిని అనుమతించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు నివేదించింది.
సీజే సూచనల మేరకు సాయంత్రం జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది విమల్ వర్మ వాసిరెడ్డి వాదనలు వినిపిస్తూ మార్గదర్శి కార్యాలయంలో సోదాలు జరుగుతున్న నేపథ్యంలో అరెస్టు చేస్తారన్న భయాందోళనలో ఉద్యోగులు ఉన్నారన్నారు. మార్చి 21న ఈ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సమన్లు అందుకున్న బ్రాంచ్ మేనేజర్లు, ఉద్యోగులకే వర్తిస్తాయని, ఇందులో కేంద్ర కార్యాలయం ఉద్యోగులు లేరన్నారు. అరెస్టు ఆందోళనలో ఉద్యోగులు ఉన్నందున వారిపై కఠినచర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
సమాచారాన్ని తీసుకెళ్లకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనికి ఏపీ ప్రభుత్వ న్యాయవాది పి.గోవిందరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉద్యోగుల రక్షణకు ప్రత్యేక దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే పిటిషనర్లయిన ఛైర్మన్, ఎండీలకు రక్షణ ఉందని, ఉద్యోగులకు కాదన్నారు. మార్గదర్శి కేసు సమాచారం తప్ప ఇతర రాష్ట్రాల సమాచారాన్ని తాము తీసుకోవట్లేదని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఉద్యోగుల తరఫున తగిన దరఖాస్తుతో రావాలని పిటిషనర్లకు సూచిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.
కుట్రలో భాగంగానే: మార్గదర్శి చిట్‌ఫండ్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలన్న భారీ కుట్రలో భాగంగానే ఆ సంస్థలో ఏదో జరిగిపోతున్నట్లు ఆరోపిస్తూ ఏపీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ దిల్లీలో విలేకర్ల సమావేశం పెట్టి, పత్రికా ప్రకటన విడుదల చేశారని మార్గదర్శి సంస్థ పేర్కొంది. సంస్థ యాజమాన్యం, సిబ్బందిని బెదిరించి చందాదారుల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు సీఐడీ ప్రయత్నిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
స్పందించిన ప్రముఖులు:మార్గదర్శిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న ఈనాడు పత్రికపై కక్షతో జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం.. రామోజీరావు ఆధ్వర్యంలోని మార్గదర్శిపై విషం కక్కుతూ తప్పుడు కేసులతో వేధింపులకు పాల్పడుతోందని.. అఖిలభారత హిందూ మహాసభ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి ఆరోపించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక మంది.. ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.
ఇవీ చదవండి: