Mahashivratri 2023 Special Story: రుద్రుడు, ముక్కంటి అయిన ఆ పరమశివుడికి మారేడు దళాలంటే అమితమైన ఇష్టం. మహా శివరాత్రి పండుగ నాడు తెలిసో తెలియకో ఓ దళాన్ని శివలింగం మీదకు విసిరేసినందుకే చాలా మంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ తొలగిపోయి.. ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి. కేవలం ఈ విధంగా మారేడు దళాలను శివలింగానికి అర్పించి పుణ్యం పొందిన భక్తులు చాలా మంది ఉన్నారని పురాణాలు తెలుపుతున్నాయి. ప్రతిరోజూ శివాలయాలలో బిల్వార్చనలు అనగా మారేడు దళాలతో అర్చనలు, పండగలప్పుడు లక్ష బిల్వార్చనలు భక్తులు జరుపుతుంటారు.
ఇలా చేయటమంతా శివ పురాణంలో మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది. సాహిత్యంలోనూ చాలా చోట్ల ఈ వృక్ష మహిమ గురించి తెలుగు సాహితీ వేత్తలు చాలా చక్కగా వర్ణించారు. శివ పురాణం విద్యేశ్వర సంహిత సాధ్యసాధన ఖండం ఇరవై రెండో అధ్యాయం వివరణలోనే మారేడు విశిష్టత, శివభక్తులలో ఉన్న ప్రవృత్తి, నివృత్తిపరుల భక్తి విశేషాలు కూడా సవివరంగా కనిపిస్తాయి. శివుడికి ప్రీతిపాత్రమైన మారేడు దళాల విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా చేస్తే పుణ్యఫలం.. జన్మధన్యం: మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం. ఆ చెట్టును దేవతలంతా పూజిస్తుంటారు. ఈ సమస్త సృష్టిలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయో.. అవి అన్నీ ఈ చెట్టు పాదులో ఉంటాయి. మారేడు చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహేశ్వరుడిని పూజించడం ఎంతో పుణ్యప్రదం. ఆ వృక్షం మొదట్లో స్నానం చేసిన వారికి సర్వ తీర్థాలలో స్నానం చేసినంత గొప్ప పుణ్యం లభిస్తుందని నమ్మకం. అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాలలో కొన్ని చోట్ల చెప్పడమూ జరిగింది. ఆ వృక్షం కుదురు ఎంతో గొప్పది. ఆ చెట్టు నీటితో తడిసి ఉన్నప్పుడు నీలకంఠుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతుంది. మరి ఆ నీలకంఠుడి అనుగ్రహం పొందాలంటే మారేడు వృక్షం మొదలును ప్రతిరోజూ నీటితో తడిపితే సరిపోతుంది. సుగంధపుష్పాలతో దానిని పూజించిన వారు శివలోకార్హతను పొందుతారు. ఆ భక్తుల ఇంట సౌభాగ్యం, సంతానం వర్థిల్లుతూ ఉంటుంది.
వృక్షం కింద ఒక్కరికి భోజనం పెట్టినా.. మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలను పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో మహేశ్వరుడిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది. కొత్త చిగుళ్లతో ఉన్న మారేడు కొమ్మను ముట్టుకోవడం, పూజించటం లాంటివి పాప విముక్తికి దోహదకారులు. అంతటి పవిత్రమైన మారెేడు చెట్టు కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఆ వృక్షం కింద ఆవు పాలు, స్వచ్ఛమైన నెయ్యితో వండిన పరమాన్నాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు ఇంకా ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పెట్టిన వాడికి దరిద్రం అనేది ఉండదు. శివుడిని పూజించిన ఈ మారేడు దళాన్ని పొందిన వారు మహా పుణ్యాత్ముడవుతాడని ప్రతీతి. శివ ప్రసాదంలో పత్రం, ఫలం, పుష్పం, జలం లాంటివన్నీ సాలగ్రామ స్పర్శ, శివలింగ స్పర్శ వల్ల అవి ఎంతో పవిత్రతను సంతరించుకుంటాయి.
భిక్షాటనతో లభించిన ఆహారమే నైవేద్యంగా.. శివుడిని పూజించే వారిలో ప్రధానంగా రెండు రకాల వారుంటారు. ఆ ఇద్దరికీ ఈ మారేడు దళాలు శివలింగమంత విలువైనవే. ప్రవృత్తి, నివృత్తి అనే రెండు రకాల భక్తి మార్గాలలో శివ భక్తులు నిత్యం పూజ చేస్తుంటారు. ప్రవృత్తి మార్గాన్ని అనుసరించే వారు శివలింగ పీఠాన్ని పూజిస్తారు. శివలింగానికి పూజ చేసిన వాళ్లకి సర్వ దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. ప్రవృత్తి మార్గాన్ని అనుసరించిన భక్తులు అభిషేకం చేసి నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. శివుడికి పూజ చేసిన అనంతరం ఆ శివలింగాన్ని శుభ్ర పరచి సంపుటిలో పెట్టి పవిత్రమైన ప్రదేశంలో భద్రపరుస్తుంటారు. ఇక నివృత్తి మార్గంలో నడిచే భక్తులు చేతిలోనే శివలింగాన్ని ఉంచుకొని పూజించి.. భిక్షాటనతో లభించిన ఆహారాన్ని ప్రసాదంగా పెడతారు.
మారేడులోని ఔషధీయ గుణాలు.. ఓంకారాన్ని సూక్ష్మ లింగంగా భావించి ఉపాసించటం నివృత్తి పరులలో కనిపించే మరో ప్రత్యేకత. వారు శివలింగాన్ని విభూతితో పూజించటం, దానినే నైవేద్యంగా ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే పూజ అయిన తర్వాత శివలింగాన్ని సర్వదా తల మీదనే ధరిస్తూ ఉంటారు. ఈ అధ్యాయంలో మారెేడు వృక్షం మహిమ, శివభక్తులలోని ప్రవృత్తి, నివృత్తి అనే మార్గాలను అనుసరించే వారి గురించి వివరించటం కనిపిస్తుంది. మారేడు చెట్టు ఇంతటి పవిత్రతను కలిగి ఉండటానికి ఆ చెట్టు పత్రాలు, బెరడు మిగతా భాగాల్లో ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషించి నేటి ప్రజలకు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం చిన్న మారేడు దళాన్ని అర్ధనారీశ్వరుడికి సమర్పించి.. ఆయన అనుగ్రహాన్ని పొందండి.
శివుడికి మారేడు అంటే ఎందుకు అంత ప్రీతి.. పురాణాలు ఏం చెబుతున్నాయి..! - తెలంగాణ తాజా వార్తలు
Mahashivratri 2023 Special Story: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మారేడు దళం. చిన్న మారేడు దళంతో పూజ చేస్తే కష్టాలను కడతేర్చుతాడని భక్తుల విశ్వాసం. అటువంటి మారేడు చెట్టు మహిమ ఏంటి.. వాటి గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయో.. శివరాత్రి సందర్భంగా తెలుసుకుందాం..
Mahashivratri 2023