ఆశలు రేపి మొండిచేయి చూపి, ఆర్కేకే వైసీపీలో ఈ దుస్థితి ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటి? Mangalagiri YSRCP MLA RK Resigned: మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా అంశంక ఆ పార్టీలో పెద్ద కుదుపుగా మారింది. ముఖ్యమంత్రి కుటుంబానికి సన్నిహితులైన ఆర్కేకే పార్టీలో ఈ దుస్థితి ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటనేదీ ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రితో ఆళ్లకు మంచి సంబంధాలు ఉండటంతో మొదట్లో అగ్ర ప్రాధాన్యమిచ్చారు. బీసీలదే సీటు అని పార్టీ అనుకున్నప్పటికీ ఆయనకే 2014, 2019లోనూ మంగళగిలో టికెట్ ఇచ్చారు.
జగన్ సోదరి షర్మిల వచ్చి ఆర్కేకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అంతేకాదు ఆయన్ను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ జగనే స్వయంగా అక్కడి జనాల ముందు ప్రకటించారు. 2019లో జగన్ సీఎం అయ్యాక ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు ఎవరికీ అపాయింట్‌మెంట్లు లేకపోయినా ఆర్కేకి మాత్రం ఎప్పుడంటే అప్పుడు దర్శనభాగ్యం దక్కేది. ముఖ్యమంత్రి కార్యాలయమే స్వయంగా కలుగజేసుకుని ఆర్కే పనులు సకాలంలో జరిగేలా చూసే పరిస్థితి ఉండేది.
జగన్ కుటుంబానికి ఆర్కే కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం, ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ కోసం టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు ఆర్కే కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టినతీరు చూస్తే కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని అంతా భావించారు. జగన్ తొలి మంత్రివర్గంలోనే ఆర్కేకు చోటు ఇస్తారనుకున్నారు. కానీ అప్పుడు జగన్ అవకాశం ఇవ్వలేదు.
వైసీపీలో మెుదలైన ముసలం - ఉదయం ఆళ్ల రామకృష్ణారెడ్డి, మధ్యాహ్నం దేవన్‌రెడ్డి వైసీపీకి రాజీనామా
గతేడాది మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు చేసినపుడు కచ్చితంగా ఆర్కేకి పదవి వస్తుందనే అంతా అనుకున్నారు. కానీ అప్పుడు కూడా మొండిచేయి చూపించారు. అప్పటినుంచిఆర్కే అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ వీడతారనే ప్రచారం జరిగింది. సీఎం ఆయన్ను పిలిపించుకుని మాట్లాడిన తర్వాత వెనక్కితగ్గారు. అది జరిగిన నాలుగు నెలలకే మంగళగిరి పట్టణ మాజీ ఛైర్మన్, బీసీ నేత గంజి చిరంజీవిని వైసీపీలోకి తెచ్చుకున్నారు. అయినప్పటికీ తానే వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా 100కి 100శాతం పోటీ చేస్తానంటూ ఆర్కే ప్రకటించినా పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఇప్పుడు ఆయనకు అక్కడ టికెట్ లేదని వైసీపీ అధినాయకత్వం స్పష్టతనిచ్చిందని తెలిసింది.
చిరంజీవిని పార్టీలో చేర్చుకున్న ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను వెంటనే వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడుగా తర్వాత ఆప్కో ఛైర్మన్‌గా నియమించారు. మంగళగిరిలో పార్టీలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న గ్రూపులను ఆ పార్టీ అధినాయకత్వం ప్రోత్సహించింది. 2019లో ఎమ్మెల్యే టికెట్ ఆర్కేకు ఇవ్వద్దని దొంతిరెడ్డి వేమారెడ్డి, మున్నంగి గోపిరెడ్డి వ్యతిరేకించారు. కానీ, అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్కేకు టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచాక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వేమారెడ్డి కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామాకి కారణం ఏంటి - ఆయన మౌనం దేనికి సంకేతం?
ఎమ్మెల్యే అందుబాటులో లేని సమయంలో మంగళగిరి-తాడేపల్లి నగర పార్టీ అధ్యక్షుడుగా వేమారెడ్డిని నియమించారు. ఈనెల 10న వేమారెడ్డి మంగళగిరిలోనే నగర పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యాలయాన్ని గంజి చిరంజీవి ప్రారంభించారు. ఇంకో వైపు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా టికెట్ రేసులో ఉన్నానంటూ ఆర్కేకి దూరంగా తన గ్రూపును కొనసాగిస్తున్నారు. మంత్రి పదవి రాకపోయేసరికి పార్టీ కార్యక్రమాలకు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు.
'మా నమ్మకం నువ్వే జగన్', 'గడప గపడకు మన ప్రభుత్వం', ఇప్పుడు 'ఏపీకి జగనే ఎందుకు కావాలి' వంటి పార్టీ కార్యక్రమాలకు ఆయన దాదాపు దూరంగా ఉన్నారు. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంపై ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన సమీక్షలకు చివరి రెండుసార్లు ఆర్కే గైర్హాజరయ్యారు. తన కొడుకు పెళ్లికి కూడా ఆయన సీఎం జగన్‌ను ఆహ్వానించలేదు. ముఖ్యమంత్రి కూడా ఆ వివాహానికి హాజరు కాలేదు. 'నా సొంత డబ్బు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో పనులు చేస్తున్నాను. అప్పులపాలయ్యాను. ఇంకా డబ్బులు పెట్టి రాజకీయం చేయలేను. దేవుడు ఏ మార్గం చూపితే ఆ దారిలో వెళతా ఇప్పటికైతే ఎమ్మెల్యేగా కొనసాగలేను' అని ఆర్కే తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.
మంగళగరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో సుమారు 130కోట్ల రూపాయల పనులను ప్రారంభించగా ఆ మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందే తప్ప అందులో కేవలం రూ.19 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రూ.130 కోట్లు మంజూరు చేశారు కదా ఆ డబ్బు వస్తే సర్దుబాటు చేయవచ్చని కార్పొరేషన్ సాధారణ నిధుల్లో నుంచి సుమారు రూ.15కోట్లను ఈ పనులకు వినియోగించారు. ఇప్పుడు ఆ డబ్బూ సర్దుబాటు చేసే పరిస్థితి లేదు.
MLA Alla Resigned : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆర్కేతన సన్నిహితుల వద్ద ఆక్రోశం వెళ్లగక్కినట్లు తెలిసింది. మంగళగిరి-తాడేపల్లిని కార్పొరేషన్ చేస్తామని, అన్ని హంగులూ కల్పిస్తూ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. కానీ, ఇప్పుడేమీ చేయకపోవడంతో జనంలో ఎమ్మెల్యేకి ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఒకరకంగా ఎమ్మెల్యేకి పొగబెట్టడంలో భాగంగానే ఇలా నిధులు ఆపేశారన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. అంతకంటే ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని 2019లో ఎన్నికల ముందు జగన్ చెప్పారు. కానీ, తర్వాత అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటూ సీఎం మాట మార్చారు. ఈ హఠాత్పరిణామంతో రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఆర్కే క్షేత్రస్థాయిలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ కోసం చంద్రబాబుపై ఆళ్లపై వ్యక్తిగతంగా కేసులు వేసి ఆయన్ను వేధింపులకు గురి చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా అన్ని చోట్లా కేసులు వేస్తూ ఒక రకంగా వెంటాడి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేశారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకూ అగ్రిగోల్డ్ ఆస్తులు, సదావర్తి భూముల తదితర వ్యవహారాల్లోనూ కోర్టుల్లో కేసులు వేశారాయన. వైసీపీ అధికారంలోకొచ్చాక అమరావతిలో అసైన్‌మెంట్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబుపై ఏపీ సీఐడీకి ఆర్కే ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో చోటు చేసుకున్న ఓటుకు నోటు కేసు విషయంలోనూ ఆ కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని, కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సీబీఐకి బదలాయించాలని కోరుతూ ఆర్కే పిల్ వేశారు. ఏ ఎమ్మెల్యే అయినా తన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగితే స్వాగతించడమే కాదు, పూర్తిస్థాయిలో సహకరిస్తారు. కానీ, ఆళ్ల రామకృష్ణా రెడ్డి మాత్రం తన నియోకజవర్గంలో రాజధాని అభివృద్ధి కాకుండా జగన్ కోసం కేసులు వేస్తూ వివాదంలోకి నెట్టే ప్రయత్నాలు చేశారు.
'ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడాలి'
హరిత ట్రైబ్యునల్‌లో కేసులు వేయడం, కింది నుంచి పై వరకు వివిధ కోర్టుల్లోనూ పిల్ వేశారు. కేసుల మీద కేసులు వేస్తూ రాజధాని పనుల విషయంలో నాటి ప్రభుత్వం ముందుకు కదల్లేనట్లుగా వెంటాడారు. రాజధాని రైతులు ఈసడించుకుంటున్నా జగన్ కోసం ఆళ్ల తన వైఖరిని అలాగే కొనసాగించారు. వైసీపీ అధికారంలోకొచ్చాక అమరావతి రాజధాని కాదని స్పష్టం చేశాక తన నియోజకవర్గంలో ఉన్న రాజధానిని లేకుండా చేస్తున్నామన్నా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోగా జగన్ కోసం చంద్రబాబుపై కేసులు వేయడంలో ఆయన ఆగలేదు.
టీడీపీ హయాంలో రాజధానిలో ఏవో జరిగిపోయాయంటూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగతంగా కేసులు మోపి ఆయన కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారు. రాజధానిలో టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలను వివాదంలోకి లాగేందుకు సీఐడీకి ఫిర్యాదు చేస్తూ, మరోవైపు కేసులు వేస్తూ వచ్చారు. చివరికి మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయానికి స్థలం కేటాయించడంపైనా సుప్రీంకోర్టులో పిల్ వేశారు. చివరకు ఆర్కే పరిస్థితి ఆకాశం నుంచి నేలకు జారినట్లు అయ్యింది.