అసైన్డ్ భూములకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి... స్థలాలను విక్రయించే ముఠాను మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి రత్నాల చెరువులో ప్రభుత్వం కొంతమంది పేదలకు గతంలో పట్టాలిచ్చింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఖాళీ స్థలాలకు పాత తేదీలతో ఉన్న డాక్యుమెంట్లు సృష్టించి కొంతమంది విక్రయిస్తున్నట్ల దర్యాప్తులో తేలిందని గుంటూరు అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి రూ.నలభై వేల నగదు, ఆరు బంగారు ఉంగరాలు, ఖాళీ నాన్ జ్యూడిషియల్ డాక్యుమెంట్స్, రబ్బర్ స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు, నాగరాజులు డబ్బులు అవసరమైనప్పుడు ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి అవసరమైన స్టాంఫ్ పేపర్లను విజయవాడకు చెందిన వక్కలగడ్డ విటల్ వద్ద పాత తేదీలతో కొనుగోలు చేస్తురని పోలీసులు తెలిపారు. కొనుగోలు చేసిన స్టాంఫ్ పేపర్లపై ఇతరుల పేర్లతో నకిలీ లింక్ డాక్యుమెంట్లు తయారు చేస్తారని... వాటిని కొనుగోలు దారులకు చూపించి విక్రయిస్తారన్నారు. అసలు డాక్యుమెంట్లే ఉండని స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రియిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు.