ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NRI Hospital: రెండుగా చీలిన ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి డైరెక్టర్లు.. కొత్త పాలకవర్గం ఎన్నిక - గుంటూరు తాజా వార్తలు

ఎన్ఆర్‌ఐ ఆసుపత్రి వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రెండు వర్గాలుగా చీలిపోయిన వారిలో ఒక వర్గం.. ఆసుపత్రిని అమ్మడానికి అంగీకరించబోమని చెప్పగా, అసలు అలాంటి ఆలోచనే తమకు లేదని రెండో వర్గం తెలిపింది. గురువారం ఆసుపత్రి డైరెక్టర్లు వేర్వేరుగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించి.. కొత్త పాలకవర్గాల్ని ఎన్నుకున్నారు.

nri new hospital committee
ఎన్నారై ఆసుపత్రి కొత్త కమిటీ ఎన్నిక

By

Published : Jun 24, 2021, 12:22 PM IST

Updated : Jun 25, 2021, 4:46 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి(NRI Hospital) కొత్త కమిటీని ఎన్నుకున్నారు. పాత కమిటీ ఆర్థిక కార్యకలాపాలల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రిని ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మడం లేదని కమిటీ సభ్యుడు అప్పారావు తెలిపారు. ఒక కమిటీకి ప్రస్తుత అధ్యక్షుడు పోలవరపు రాఘవరావే అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, మరో వర్గం మంతెన నరసరాజును అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. నరసరాజు, ముక్కామల అప్పారావుల వర్గం ఆసుపత్రిని అమ్మేసేందుకు ప్రయత్నిస్తోందని, కొందరు సభ్యులకు డబ్బు ఎరవేసి, మరికొందరిని బెదిరించి, భయపెట్టి దానికి ఒప్పించే ప్రయత్నం చేస్తోందని రాఘవరావు వర్గం దుయ్యబట్టింది. ప్రస్తుత కమిటీపై నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు వచ్చాయని.. దానిపై విచారించి, నిగ్గు తేలుస్తామని నరసరాజు వర్గం ధ్వజమెత్తింది.

రాఘవరావు అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత కమిటీ ఒక్క కార్యదర్శి మినహా ప్రస్తుతం ఉన్న కమిటీనే యథాతథంగా మళ్లీ ఎన్నుకుంది. ఉపాధ్యక్షుడిగా నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌, కార్యదర్శిగా ఆవుల సురేంద్రనాథ్‌, కోశాధికారిగా అక్కినేని మణి ఎన్నికయ్యారని, తమ సమావేశానికి 17 మంది సభ్యులు హాజరయ్యారని రాఘవరావు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ‘మా సమావేశానికి హాజరైన 17 మందీ 2003 నుంచి డైరెక్టర్లుగా ఉన్నాం. మాదే అసలైన కమిటీ. ముక్కామల అప్పారావు ప్రవర్తన సరిగా లేకపోవడంతో రెండురోజుల క్రితం అత్యవసర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం నిర్వహించి ఆయనను కార్యదర్శిగా తొలగించాం. తీసేసిన కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహణ చెల్లదు. ఆ కమిటీకి చట్టబద్ధత లేదు. వాళ్లు ఈ కాలేజీని ఇతరులకు అమ్మేసేందుకు ప్రయత్నించారు. దాన్ని మేం అడ్డుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

తొమ్మిది మందితో మరో కమిటీ

మరోపక్క ముక్కామల అప్పారావు వర్గం తొమ్మిది మందితో నూతన కమిటీని ప్రకటించింది. మంతెన నరసరాజును అధ్యక్షుడిగా, ముక్కామల పార్థసారథిని ఉపాధ్యక్షుడిగా, సోము కృష్ణమూర్తిని కార్యదర్శిగా, సి.తిరుపతయ్య చౌదరిని కోశాధికారిగా ఎన్నుకున్నట్టు తెలిపింది. తమ సమావేశంలో 19 మంది పాల్గొన్నారని, మెజారిటీ తమకే ఉందని నరసరాజు ప్రకటించారు.

చావమంటే చస్తాం... బయటకు వెళ్లం: ఉపేంద్రనాథ్‌

‘బయటి నుంచి వచ్చిన వ్యాపారవేత్త ఒకరు మా సభ్యుల్లో కొందరికి డబ్బులిచ్చి వాళ్లవైపు లాక్కున్నారు. ఆసుపత్రిని, కాలేజీని అమ్మేద్దామని ప్రయత్నిస్తున్నారు. వాళ్లతో మేఘా కృష్ణారెడ్డి ఒప్పందానికి వచ్చారు. ఆ తర్వాత మాతోనూ మాట్లాడారు. ఆసుపత్రి వాళ్లకిస్తే... మాలాగే సేవలు కొనసాగిస్తారని అనిపించింది.. కానీ వారు మాట్లాడిన విధానం బాగోలేదు. సామరస్యంగా కాకుండా బెదిరిస్తున్నట్లు మాట్లాడారు. అది మాకు నచ్చలేదు. బయటకు వెళతారా? చస్తారా అంటే... చావనైనా చస్తాం గానీ బయటకు వెళ్లం’ అని ఉపేంద్రనాథ్‌ ధ్వజమెత్తారు. కోశాధికారి అక్కినేని మణి మాట్లాడుతూ... ‘2013లో ఎల్‌ఈపీఎల్‌ సంస్థ వాళ్లు వేలు పెట్టినప్పటి నుంచీ ఎన్‌ఆర్‌ఐలో సమస్యలు మొదలయ్యాయి. నాలుగైదు నెలల క్రితం కమిటీలోని ఏడుగురు సభ్యుల్ని అక్రమమార్గాల్లో వాళ్లవైపు తిప్పుకొన్నారు. మరికొందరు కలిస్తే... వాళ్లకు మెజార్టీ వస్తుందని భావించి, ఆసుపత్రి అమ్మకానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాకు వయసు పెరుగుతోంది. సమర్థుల చేతిలో ఆసుపత్రి పెట్టాలన్న ఆలోచన ఉన్నా... వాళ్లు అనుసరిస్తున్న విధానం సరిగా లేదు. ఆసుపత్రిలో రూ.100 కోట్ల అక్రమాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తూ మమ్మల్ని తొలగించాలనో, జైల్లో పెట్టాలనో చూస్తున్నారు. మేమే ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించి, మాపై వాళ్లు చేస్తున్న ఆరోపణలు నిజం కాదని నిరూపిస్తాం’ అని తెలిపారు.

సొసైటీ కింద ఉంది... అమ్మడం సాధ్యపడదు: నరసరాజు

‘ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తే వాటిపై మాట్లాడదామని సమావేశం పెట్టాం. ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు ఎలాంటి వివరణా ఇవ్వలేదు. అందుకే కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకున్నాం. ఆసుపత్రిని అమ్మేస్తున్నామన్న ప్రచారం సరికాదు. ఇది సొసైటీ కింద ఉంది. దీన్ని అమ్మడం సాధ్యపడదు. మాకు ఆ ఆలోచనా లేదు. ఇలాంటి ప్రచారాలు ఎలా వస్తున్నాయో తెలీదు’ అని మంతెన నరసరాజు తెలిపారు. ‘ఎన్‌ఆర్‌ఐలో ఒక్క రూపాయి లాభం వచ్చినా సొంతానికి వాడం. అలా చేస్తే మమ్మల్ని మేం మోసం చేసుకున్నట్టే. నేను కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి.. ఎన్‌ఆర్‌ఐలో అవకతవకల ఆరోపణలపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది. దేశంలోని అగ్రశ్రేణి ఫైనాన్సింగ్‌ ఏజెన్సీలను పిలిపించి ఆడిట్‌ చేయిస్తే విశ్వసనీయత ఉంటుంది. అక్రమాలు జరగలేదని తేలితే అదే విషయాన్ని ప్రకటిస్తాం’ అని ముక్కామల అప్పారావు తెలిపారు.

నిర్వాహకులపై ఈ నెల 19న కేసు

ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి నిర్వాహకుల్లో పలువురిపై మంగళగిరి గ్రామీణ పోలీసులు ఈ నెల 19న ఓ కేసు నమోదుచేశారు. నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాసఘాతుకం, నేరపూరిత బెదిరింపు తదితర అభియోగాల్ని మోపుతూ ఐపీసీలోని 120బీ, 409, 471, 420, 506 సెక్షన్ల కింద ఈ కేసు పెట్టారు. నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌, అక్కినేని మణి, ఉప్పలాపు శ్రీనివాసరావు, వల్లూరిపల్లి నళినీమోహన్‌, మంతెన శ్రీనివాసరాజు తదితరులు సొసైటీ నిధుల్ని దారి మళ్లించి వారి వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని, కొవిడ్‌ రోగుల నుంచి అధిక మొత్తాల్లో వసూలు చేసి.. తక్కువ మొత్తాల్ని అధికారికంగా చూపించారంటూ ఆసుపత్రిలో ఆఫీస్‌ అసిస్టెంట్‌గా పనిచేసే గొడ్డిపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు పెట్టారు. దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ తాజాగా వెలుగుచూసింది. ఈ కేసు వ్యవహారంలోనే మంగళగిరి పోలీసులు బుధవారం ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో సోదాలు చేసి వల్లూరిపల్లి నళినీమోహన్‌, ఉప్పలాపు శ్రీనివాసరావును అరెస్టు చేశారు. వారిని న్యాయస్థానంలో గురువారం హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండు విధించారు. జి.కామేశ్వరరావు, వైవీఆర్‌ నాగేశ్వరరావు, పి.యుగంధర్‌ను కూడా పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టారు.

వైద్యులను అరెస్టు చేయొద్దు: హైకోర్టు ఆదేశం

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానివద్ద ఉన్న ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అధ్యక్షుడు రాఘవరావు, ఉపాధ్యక్షుడు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌, కోశాధికారి అక్కినేని మణిలను అరెస్టు చేయొద్దని మంగళగిరి గ్రామీణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వారిపై తొందరపాటు చర్యలు వద్దని స్పష్టం చేసింది. అత్యవసరంగా దాఖలైన వ్యాజ్యంపై గురువారం ఉదయం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. సొసైటీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఓ వ్యక్తి ఈ నెల 19న మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై తప్పుడు కేసు నమోదు చేశారని, ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి సర్వసభ్య సమావేశానికి హాజరుకాకుండా నిలువరించేందుకు పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషనర్లు హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం వేశారు. వారి తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ వాదనలను వినిపించారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్‌పై కేసుల ఉపసంహరణ.. సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ

పెట్రో ధరల పెరుగుదల.. ఒక్కో ఎకరాపై రూ.3వేల వరకు భారం

Last Updated : Jun 25, 2021, 4:46 AM IST

ABOUT THE AUTHOR

...view details