ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం, పుచ్చకాయలపల్లికి చెందిన శెట్టి గాలయ్య పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఇతను మద్యం, ఇతర వ్యసనాలకు బానిసయ్యాడు. గతంలో మావోయిస్టులు తమ ప్రాంతంలోని లక్షాధికారులను గుర్తించి, బెదిరింపు లేఖలు పంపి, డబ్బు రాబట్టారని ఎవరి ద్వారానో తెలుసుకున్నాడు. తాను కూడా అలాగే చేయాలని భావించి, ఓ ఆసామిని తీవ్రంగా బెదిరిస్తూ వారి ఇంటి ఆవరణలో ఓ లేఖ పడేశాడు. తాను చెప్పినట్టు రూ.లక్ష నగదును సంకేత స్థలంలో ఉంచకపోతే చంపేస్తానంటూ అందులో హెచ్చరించాడు. సదరు ఆసామి ఈయన లేఖలో పేర్కొన్నట్టే రూ.లక్ష నగదును సంకేత స్థలంలో ఉంచారు. అలా అయాచితంగా వచ్చిన డబ్బుతో జల్సా చేసిన గాలయ్య పైసలు అయిపోగానే గుంటూరు పరిసర ప్రాంతాలకు వచ్చి పొలం పనులు చేసుకోవడం ఆరంభించాడు.
ఈ క్రమంలో ఆర్నెల్ల క్రితం పరిచయమైన ప్రకాశం జిల్లా నడిగడ్డ గ్రామానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె తన కుమార్తెకు బంగారు వస్తువులు చేయించాలని పట్టుబట్టింది. ఓ వైపు అతనికి అప్పులు పెరిగిపోవడం, మరో వైపు ఆ మహిళ ఒత్తిడి కారణంగా అక్కడ ఉండలేక పనులు చేసుకునేందుకు గుంటూరు జిల్లా నరసరావుపేట చేరుకున్నాడు. మళ్లీ ఎవరినైనా బెదిరించి ఆమేరకు డబ్బు రాబట్టాలని భావించాడు. ఈ సారి ఎవరి చెయ్యినైనా నరికి తీసుకెళ్లి, దాన్ని చూపి, ఆసామి నుంచి అధికంగా డబ్బు రాబట్టాలనే రాక్షస ఆలోచన వచ్చింది.