Mangalagiri AIIMS in Guntur: మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి వైద్య సేవల్లో ప్రత్యేకత చాటుకుంటోంది. నాలుగేళ్ల నాటితో పోల్చితే ప్రస్తుతం చికిత్సలతో పాటు రోగుల సంఖ్య భారీగా పెరిగింది. వచ్చిన వారికి అత్యున్నత వైద్యం అందిస్తూ... వైద్యులు ప్రశంసలు పొందుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల కంటే... ఖర్చుతో పాటు సేవల్లో నాణ్యత బాగుందని రోగులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రదాయనిగా మారిందని కితాబిస్తున్నారు.
విభజన చట్టం ప్రకారం ఏర్పాటై 2019 మార్చి 12న ఓపీ సేవలు మొదలుపెట్టిన మంగళగిరి ఎయిమ్స్... సేవల్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మొదటి రోజున 44మంది రోగులు వచ్చిన ఆసుపత్రికి.. ప్రస్తుతం బిజీ రోజుల్లో 2వేల500మంది వరకు సేవలు పొందుతున్నారు. ఈ నాలుగేళ్లలో దాదాపు 10లక్షల మంది ఎయిమ్స్‌లో వైద్య సేవలు పొందారు. 2020 జూన్ 11న ఇన్ పేషెంట్ సేవలు మొదలవగా... ఇప్పటి వరకూ 7వేల 500మంది చికిత్స తీసుకున్నారు. ఇక్కడ ఓపీ ఫీజు 10 రూపాయలే. వివిధ రకాల ఎక్స్‌రేలు, స్కానింగ్‌లకు బయటి ధరలతో పోలిస్తే 30నుంచి 40శాతం తక్కువ. బ్లండ్ బ్యాంకు, సీటీ, ఎమ్ఆర్ఐ, పీఈటీ స్కానింగ్, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, కాన్పులు, రేడియో థెరపీ, ట్రామాతో పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆయుస్మాన్ భారత్, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నారు. వైద్య కళాశాలలో 125 ఎంబీబీఎస్ సీట్లు, పీజీ విభాగంలో 40 సీట్లు ఉన్నాయి. గతేడాది నర్సింగ్ కళాశాల కూడా ప్రారంభమైంది.
సమస్యను సరిగ్గా గుర్తించి, అందాల్సిన వైద్యాన్ని కచ్చితంగా అందిస్తున్నారని.. చికిత్స కోసం వచ్చినవారు చెబుతున్నారు. ఎయిమ్స్ లాంటి ఆసుపత్రి ఉండటం రాష్ట్రానికి గొప్ప వరమని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎయిమ్స్ నిర్మాణ పనులు 98 శాతం మేర పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అంతర్గతంగా కొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.