గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు వద్ద 2017 సంవత్సరంలో జరిగిన రహదారి ప్రమాదంపై గుంటూరు జిల్లా చిలకలూరిపేట న్యాయస్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. వ్యక్తి మృతి చెందడానికి కారకుడైన వాహనచోదకుడికి ఏడాది జైలు శిక్ష విధించింది.
నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు ఏడాది జైలు శిక్ష - గుంటూరు జిల్లా తాజా వార్తలు
నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన వాహనచోదకుడికి గుంటూరు జిల్లా చిలకలూరిపేట న్యాయస్థానం.. ఏడాది జైలు శిక్ష విధించింది. 2017లో ఘటన జరగ్గా... బుధవారం తీర్పు వెలువడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాదెండ్ల మండలం సాతులూరు వద్ద 2017లో షేక్ మస్తాన్ వలి అనే వ్యక్తిని వట్టిచెరుకూరు మండలం చమళ్లపూడికి చెందిన బేతపూడి భాస్కరరావు తన కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాధితుడు మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది.
కారును నిర్లక్ష్యంగా నడిపినట్లు రుజువైన పరిస్థితుల్లో నిందితునికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విజయ్ కుమార్ రెడ్డి ఏడాది జైలు శిక్ష విధించారు. బాధితుల తరఫున ఏపీపీ అల్లంశెట్టి పవన్ వాదనలు వినిపించారు.