Mahatma Gandhi Inner Ring Road : లేడి లేచిన వెంటనే పరుగు అన్నటు.. ప్రస్తుత మానవ జీవితంలో ఉదయం నిద్ర లేచినప్పటీ నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితం. అలాంటి జీవితాలను గడుపుతున్నా మానవులకు సరైన రహదారి ఉండటం ఎంతో ముఖ్యం. కానీ రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారాయి. రహదారుల నిర్మాణానికి గత ప్రభుత్వం చేపట్టిన పనులు.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
అలాంటి పరిస్థితిలో ఉన్న రహదారై.. మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్‌రోడ్డు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి ఈ రహదారి ఎంతో ముఖ్యమైనది. ఇది పూర్తి అయితే.. ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు పూర్తి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా.. అమరావతి, విజయవాడ, కర్నూలు, హైదరాబాద్ వెళ్లే వారు నగరం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా ఆ దారిగుండా వెళ్లే.. చాలా సమయం ఆదా అవుతుంది. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ నిర్మాణాన్ని ప్రారంభించడంలో చొరవ చూపడం లేదు. ఈ రహదారి పూర్తయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆ దిశగా అటు సీఆర్డీఏ, ఇటు నగరపాలక సంస్థ అడుగులు వేయలేకపోతుంది. అసంపూర్తి పనులతో పాటు భూసేకరణ సమస్య కూడా కొలిక్కిరాలేదు. ఇలా అడుగడుగునా అడ్డంకులతో.. గుంటూరు మహాత్మగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది.
People's problems with traffic jam :రోజూ ట్రాఫిక్ జామ్‌తో.. నగరవాసుల కష్టాలు మాటల్లో చెప్పలేం. ఎంతో ముఖ్యమైన పనులకు వెళ్లాలనుకునేవారు పొరపాటున మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో వస్తే.. పని వాయిదా వేసుకోవాల్సిందే. ఎందుకంటే వందలాది వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి ఉంటాయి. గుంటూరు నగరానికి ఇన్నర్ రోడ్డును 2005లో అప్పటి వీజీటీఎం ఉడా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ఈ దిశగా.. ప్రజలకు ట్రాఫిక్ నుంచి విముక్తి కల్పించాలనే సంకల్పంతోనే.. టీడీపీ పార్టీ హయాంలో మహాత్మాగాంధీ ఇన్నర్ రోడ్డుకు శ్రీకారం చుట్టారు. 2010-14 మధ్యకాలంలో.. ఆటోనగర్ నుంచి రెడ్డిపాలెం వరకు.. తొలిదశలో 4.7 కిలోమీటర్ల మేర అమరావతి రహదారిని అనుసంధానం చేస్తూ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2014 తర్వాత రూ. 29.08 కోట్లతో.. అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతినగర్ వరకు రెండో దశలో 2 కిలోమీటర్ల రహదారిని పూర్తి చేశారు. 2014లో రాష్ట్రం విడిపోవడం.. రాజధాని రాకతో ఆ ప్రాంతం సీఆర్డీఏ పరిధిలోకి వెళ్లింది. నగరంలోని ట్రాఫిక్ సమస్యలను తీర్చడం కోసం.. 2019లో సీఆర్డీఏ రూ. 33 కోట్లు.. 80అడుగుల దూరం పూర్తి చేసేందుకు.. నిధులను మంజూరు చేసింది. రహదారి నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ సైతం పూర్తయింది. సీఆర్డీఏ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచి గుత్తేదారును ఎంపిక చేసి నిర్మాణ పనులు అప్పగించింది. కానీ ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే ఒక చిక్కువచ్చి పడింది.