పంచారామక్షేత్రం అమరావతి.. శివనామ స్మరణతో మార్మోగుతోంది. మహా శివరాత్రి పర్వదినాన అమరలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివయ్య చల్లగా కాపాడాలంటూ ప్రార్థించారు. మొక్కులు చెల్లించారు. గుంటూరు జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయం పక్కనే కృష్ణా నదిలో స్నానమాచరించి.. ప్రత్యేక పూజలు చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా వేమూరు నియోజకవర్గంలోని అమర్తులూరు మండలంలో వెలసిన బాలకోటేశ్వరస్వామి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. 120 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈవో బి.అశోక్ కుమార్ తెలిపారు. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం 4 ఆర్టీసీ డిపోల నుంచి దాదాపుగా 70 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. గర్భగుడిలో దంపతులకు ప్రత్యేకంగా రూ.2వేలతో దివ్యదర్శనానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు.
పత్తిపాడు నియోజకవర్గంలో మహాశివరాత్రి పర్వదినాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. పెదనందిపాడులో సోమేశ్వరస్వామి ఆలయంలో మహిళలు కలశాలు తీసుకుని.. గ్రామంలో ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయంలో కలశ పూజ చేసి.. స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి కళ్యాణంతో పాటు లింగోద్భవ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు.