All India Cycle Tour :మహిళా సాధికారత, భద్రత నినాదంతో మధ్యప్రదేశ్‌కు చెందిన ఆశా మాల్వియా దేశవ్యాప్త సైకిల్ యాత్రను చేపట్టింది. దేశంలోని అన్నిరాష్ట్రాలతో పాటు 4 కేంద్ర పాలిత ప్రాంతాలను సందర్శించేలా సైకిల్ యాత్రకు రూపకల్పన చేసుకుంది. మధ్యప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2022 నవంబర్ 1వ తేదీన.. భోపాల్‌లో ఈ యాత్రను ప్రారంభించింది. ఇప్పటి వరకూ 8 రాష్ట్రాలలో ఆశా మాల్వియా సైకిల్ యాత్ర పూర్తి చేసుకుంది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో యాత్ర పూర్తి చేసుకుని.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో యాత్ర నిర్వహిస్తోంది.
మహిళా సాధికారత, భద్రత నినాదంతో సైకిల్ యాత్ర చేస్తున్నట్లు ఆశా మాల్వియా తెలిపింది. మనదేశంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉందని, అలాగే వారి భద్రతకు ఢోకా లేదని ఆశా చెబుతోంది. ఈ సందేశాన్ని అందరికీ తెలియజెప్పేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేసింది. తన పర్యటనలో పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించినట్లు వెల్లడించింది. అంతర్జాతీయ టూరిస్టులు ఇండియాకు ధైర్యంగా రావొచ్చని.. ఇక్కడ వారి భద్రతకు ముప్పేం లేదని అంటోంది. ఒంటరిగా సైకిల్‌పై తిరుగుతున్న తానే భారత్‌లో ఉన్న భద్రతకు నిదర్శనమని చెబుతోంది.
ఆశా మాల్వియా జన్మించింది మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్ఘడ్ జిల్లా నాటారాం గ్రామం. ఆమె తండ్రి చిన్నతనంలోనే మరణించగా.. తల్లి కూలి పనులు చేస్తూ ఆశాను ఆమె చెల్లిని చదివించింది. ఆశాకు చిన్ననాటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. అంతేకాకుండా సాహసాలంటే మరింత ఆసక్తి. ఆమె ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పీజీ పూర్తి చేసింది. అథ్లెటిక్స్‌లో రాణించి.. పర్వతారోహణలో శిక్షణ తీసుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత హిమలయాలను అధిరోహించింది. హిమాలయాల పర్వతాలపై సుమారు 20 వేల 500 వందల అడుగుల ఎత్తు వరకు వెళ్లి.. భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. అప్పుడే ఆమెకు దేశ ప్రశంసలు అందాయి. ఆ స్పూర్తితోనే ఇప్పుడు దేశ వ్యాప్త పర్యటన చేస్తున్నట్లు మాల్వియా వెల్లడించింది. అమ్మాయిలు దేనికి భయపడొద్దని.. లక్ష్యం నిర్దేశించుకుని, సాధించే వరకు పోరాడాలని సూచించింది. మధ్యలో లక్ష్యాన్ని వదిలి విశ్రమించకూడదనే స్పూర్తిని పంచుతోంది. యువత మానసికంగా కుంగిపోకూడదని.. ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని సందేశాన్ని ఇచ్చింది.
" నేను భారత్ మొత్తం చుట్టేందుకు ఒంటరిగా సైకిల్ యాత్రను ప్రారంభించాను. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ప్రారంభించిన నా యాత్ర దేశంలో 2500 కిలో మీటర్ల మేరకు సాగనుంది. మహిళ భద్రత, సాధికారతే నినాదంగా ప్రారంభించాను. భారత్‌లో మహిళలకు భద్రతకు ఏలాంటి ముప్పు లేదని ప్రపంచానికి తెలసేలా సందేశమిచ్చేందుకు ఈ యాత్రను ప్రారంభించాను." - ఆశా మాల్వియా
ఆశా యాత్ర గురించి తెలిసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు సైకిల్ ప్రధానం చేసింది. తన యాత్రలో భాగంగా దేశంలోని రాష్ట్రాలను, రాష్ట్ర రాజధానులను, ముఖ్య నగరాలను, ప్రధాన పట్టణాలను సైకిల్‌పై చూట్టేస్తోంది. ఏ రాష్ట్రంలో పర్యటన ఉంటే ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖులతో, ముఖ్యులతో, అధికారులతో సమావేశం అవుతోంది. కేరళలో పర్యటించినపుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ను, తమిళనాడులో సీఎం స్టాలిన్‌లతో ఆసా భేటి అయ్యింది. మరికొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర మంత్రులను, జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను కలిసింది. తన యాత్ర ఉద్దేశాన్ని అందరికీ వివరిస్తూ ముందుకు సాగుతోంది. అందరూ తనను ఎంతగానో అభినందించి, ఆతిథ్యం ఇచ్చినట్లు ఆశా తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆమె కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసిన ఆమెను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆమె యాత్రకు 10 లక్షల ఆర్థిక సహాయం ఆమె యాత్ర గురించి ఆమె సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మహిళల భద్రత, సాధికారత కోసం తీసుకున్న చర్యలను ఆమె కొనియాడారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న యాత్రను ముఖ్యమంత్రి ప్రోత్సహించారని ఆమె తెలిపింది. తన యాత్ర కోసం ముఖ్యమంత్రి చేసిన ఆర్థిక సహాయానికి ఆమె ధన్యవాదలు తెలిపారు.