ప్రేమ కొందరికి అందమైన జీవితాన్ని ఇస్తుంది. కొంతమంది భవిష్యత్తును బలిగొంటుంది. ప్రేమ విఫలమై ఇంట్లో నుంచి పారిపోయిన ప్రశాంత్ పాకిస్థాన్‌కు చేరుకున్న ఘటన మరువకముందే... హైదరాబాద్ నగరంలో మరో ఘటన జరిగింది. ప్రేమిస్తే సినిమాలో భరత్‌ని తలపించేలా మార్చింది. ఓ ప్రైవేటు సంస్థలో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పిచ్చివాడిలా మార్చి... నడిరోడ్డుపై పడేసింది.
వివరాల్లోకి వెళ్తే...
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3 సిగ్నల్ వద్ద... మతి స్థిమితం లేని వ్యక్తి హల్ చల్ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఇబ్బందులకు గురిచేశాడు. సిగ్నల్ వద్ద ఉన్న జనాలపై రాళ్లు రువ్వాడు. భయాందోళనలకు గురైన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులను కొద్దిసేపు ముప్పతిప్పలు పెట్టాడు. ఎట్టకేలకు ఆ వ్యక్తిని తాడుతో కట్టేసి ఆటోలో స్టేషన్‌కు తరలించారు.