Lorry Owners Worry about High Green Tax: రాష్ట్రంలో ఉన్న లారీ యజమానులు, డ్రైవర్లు ప్రభుత్వం విధించే పన్నుల భారం తట్టుకోలేక లబోదిబోమంటున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా జగన్ సర్కార్ లారీ యజమానుల ముక్కుపిండి వసూలు చేస్తోంది. సరకు రవాణాదారుల నుంచి వసూలు చేసే హరిత పన్ను గతంలో సంవత్సరానికి కేవలం 200 రూపాయలు ఉండేది. దాన్ని గరిష్ఠంగా.. 30 వేల 820 చేశారు.
హరిత పన్ను ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు వసూలు చేస్తున్నారు అనే ప్రశ్నకి మాత్రం వైసీపీ సర్కార్ వద్ద సమాధానం ఉండటం లేదు. మన రాష్ట్రంలో డీజిల్ ధరలు అధికంగా ఉండటంతో.. లారీ యజమానులు నెలవారీ కిస్తీలు కట్టడానికే ఆపసోపాలు పడుతున్నారు. ఇంతటి దీన స్థితిలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వమే.. పన్నుల భారంతో వారి నడ్డి విరుస్తోంది.
Lorry Owners Association Demand: పెంచిన పన్ను తగ్గించాలి.. లేకుంటే ఉద్యమిస్తాం: లారీ ఓనర్ల అసోసియేషన్
సరకు రవాణా వాహనాలుకు ఏడేళ్ల వరకు గ్రీన్ ట్యాక్స్ ఉండదు. ఆ తర్వాత మాత్రమే చెల్లించాలి. కాలం చెల్లుతున్న వాహనాల సంఖ్య తగ్గించేందుకు హరిత పన్ను పెంచే వీలును రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కల్పించింది. దీన్ని అదునుగా తీసుకున్న జగన్ సర్కార్.. లారీ యజమానులపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఏటా 200 రూపాయలుగా ఉన్న పన్నును తొలగించి.. మూడు స్లాబ్‌లుగా మార్పు చేసింది.
7 నుంచి పదేళ్ల మధ్య వాహనాలకు త్రైమాసిక పన్ను విలువలో సగం, 10 నుంచి పన్నెండేళ్ల మధ్య వాటికి ఒక త్రైమాసిక పన్ను విలువ, 12 ఏళ్లకు పైబడిన వాహనాలకు రెండు త్రైమాసిక పన్నుల విలువ మేరకు చెల్లించాలని గతేడాది ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో త్రైమాసిక పన్ను 6 టైర్ల లారీకి 4 వేల 790 , 16 టైర్ల లారీకి 15 వేల 410 ఉంది. అంటే ఆయా లారీలను బట్టి హరిత పన్ను కనిష్టంగా 2 వేల 395 నుంచి గరిష్ఠంగా 30వేల 820 వరకు చెల్లించాల్సి వస్తుంది.
'రవాణా వాహనాలకు గ్రీన్‌టాక్స్ ఉపసంహరించుకోవాలి..'
కర్ణాటకలో హరిత పన్ను ఏడాదికి 200రూపాయలు ఉండగా.. తమిళనాడులో 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. తెలంగాణలోనూ గతేడాది ఏపీలో మాదిరి మూడు స్లాబ్‌లు హరిత పన్ను విధానాన్ని అమలు చేశారు. అయితే... అక్కడి లారీ యజమానుల సంఘాలు పన్నుల భారం భరించలేక పోతున్నామని తెలంగాణ సర్కార్‌ని విజ్ఞప్తి చేశాయి. దీంతో వారి ఆవేదన అర్థం చేసుకున్న తెలంగాణ సీఎం హరిత పన్నును తగ్గించారు. 7 నుంచి 12 ఏళ్ల మధ్య వాహనాలకు 15 వందలు, 15 ఏళ్లు పైబడిన వాహనాలకు 3 వేలు మాత్రమే చెల్లించేలా సవరించారు.
High Green Tax Imposed by Andhra Pradesh Government: పన్నుల భారంపై లారీ యజమానులు జగన్‌కి ఎన్ని సార్లు విన్నవించినా.. ఆయన మాత్రం కనికరించలేదు. సర్కార్ తీసుకునే నిర్ణయాల వల్ల తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందంటూ లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రైమాసిక పన్ను, హరిత పన్ను, నేషనల్ పర్మిట్ ట్యాక్స్.. లాంటి వన్ని కలిపి తడిసిమోపెడు అవుతుందని సరకు రవాణా వాహనదారులు వాపోతున్నారు.
పెంచిన హరితపన్ను వసూలు నిలిపివేయండి.. సీఎంకు లారీ యజమానుల సంఘం లేఖ
11 ఏళ్లు పైబడిన 12 టైర్ల లారీకి మన రాష్ట్రంలో త్రైమాసిక పన్ను కిందటి ఏడాదికి 43వేల 640, హరిత పన్ను 21వేల 820, నేషనల్ పర్మిట్‌కు 17వేలు చెల్లించాల్సి వస్తుంది. ఇవన్నీ కలిపితే 80వేల 460 రూపాయలు అవుతుంది. మళ్లీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ దాదాపు 50వేల వరకు చెల్లించాలి.
అంటే మొత్తంగా లక్షా 32వేలు చెల్లిస్తూ.. నెలవారీ కిస్తీలు కట్టిన తర్వాత ఏమైనా మిగిలితే దాంతో కుటుంబాన్ని పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తాము ఇన్ని అవస్థలు పడుతున్నా జగన్ సర్కార్ తమ గోడును ఆలకించడం లేదని లారీ యజమానుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా తమ గోడును రాష్ట్ర ప్రభుత్వం ఆలకించి పన్నుల భారాన్ని తగ్గించి రవాణా రంగాన్ని కాపాడాలని లారీ యజమానులు కోరుతున్నారు.
హరిత పన్ను ప్రభావం.. నష్టాల ఊబిలో కూరుకుపోతున్న రవాణా రంగం