లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి దుకాణాలు, షోరూమ్‌లు, గోదాములు మూతపడ్డాయి. చాలావరకు పరిశ్రమలు తెరిచే అవకాశం లేకుండా పోయింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి సరకు తీసుకొచ్చిన డ్రైవర్లు లారీలను రోడ్ల పక్కనే నిలిపేయాల్సి వచ్చింది. టీవీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల లోడుతో వచ్చిన లారీలు రాష్ట్రంలోని పలు నగరాల్లో నిలిచిపోయాయి. గోదాములు నిండిపోవడంతో వీటిని దించుకోలేమని డీలర్లు చెబుతున్నారు.
కొన్నిచోట్ల వీటిని దించేందుకు హమాలీలు సైతం రావడం లేదు. ఇనుము, టైల్స్, కాఫీ గింజలు, యంత్ర పరికరాలు వంటి ఇతర సామగ్రితో వచ్చిన పలు లారీలదీ ఇదే పరిస్థితి. దేశవ్యాప్తంగా 35 వేలకు పైగా లారీలు ఇలా వేరే రాష్ట్రాల్లో నిలిచిపోయినట్లు చెబుతున్నారు. వీటిలో మన రాష్ట్రానికి వచ్చి ఆగిపోయినవి వెయ్యి వరకు ఉన్నాయి.
లారీ కార్మికులకూ ఇక్కట్లు...
మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన లారీలు సైతం చిక్కుకుపోయాయి. విశాఖ నుంచి తారు లోడుతో తమిళనాడు, కర్ణాటక వెళ్లిన లారీలు అక్కడే నిలిచిపోయాయి. గోదావరి జిల్లాల నుంచి చేపల లోడుతో ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లి, మళ్లీ అక్కడి నుంచి వేరొక లోడు తీసుకొచ్చే ప్రయత్నంలో కొన్ని లారీలు ఉండిపోయాయి. ఏపీకి చెందిన దాదాపు 2,500 లారీలు పలు రాష్ట్రాల్లో ఆగిపోయినట్లు ఏపీ లారీ యజమానుల సంఘం తెలిపింది.