రాష్ట్రంలో ఇసుక కొరతపై పోరాటాన్ని తెలుగుదేశం ఉద్ధృతం చేసింది. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట... ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్... ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇసుక కొరత కారణంగా కార్మికులు పస్తులుంటున్నా... ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి... వైకాపా నేతలు దోచుకుంటున్నారని లోకేశ్ ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల్లో కొరత ఎందుకు లేదు..?
ఇసుక విషయంలో అవినీతి చేశామని... తమపై వైకాపా ఆరోపణలు చేసిన విషయం గుర్తుచేశారు. ఇప్పుడు ఇసుక ఎవరు తింటున్నారో ప్రజలకు తెలుసునని లోకేశ్ ఎద్దేవా చేశారు. కొత్త ఇసుక విధానమంటే నల్లబజారులో అమ్ముకోవడమా..? అని ప్రశ్నించారు. వరదల కారణంగా ఇసుక లేదనడం సాకు మాత్రమేనన్న ఆయన... అలాగైతే మిగతా రాష్ట్రాల్లో ఇసుక సమస్య ఎందుకు లేదని నిలదీశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు తిరగబడితే వైకాపా ప్రభుత్వం ఒక్కరోజు కూడా ఉండదని హెచ్చరించారు.